Telangana | గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బల్ల గంగా భవానీ(26) ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ఆమె.. తన క్వార్టర్స్‌లోనే ఉరేసుకుంది. 15 రోజుల క్రితమే నిశ్చితార్థం అయిన గంగాభవానీ బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గంగా భవానీ ఈ నెల 7వ తేదీన హెడ్ క్వార్టర్స్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సెంట్రింగ్ డ్యూటీ చేసి తన క్వార్టర్స్‌లోకి వెళ్లింది. రాత్రి 9 గంటలు అయినా గంగాభవానీ డ్యూటీకి రాకపోవడంతో అధికారులు ఆమె క్వార్టర్ దగ్గరకు వెళ్లారు. తలుపు గడియపెట్టి ఉండటంతో దంతివాడ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులను తొలగించారు. దీంతో కిటికీ ఇనుప గ్రిల్స్‌కు ఉరేసుకుని ఉండటం గమనించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఆదివారం సాయంత్రం గంగాభవానీ మృతదేహం ఎన్టీపీసీకి చేరుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, గంగాభవానీకి ఇటీవలే వివాహం కుదిరింది. ఆగస్టు 22వ తేదీన ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. డిసెంబర్ 5వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కోసం సెలవులకు వచ్చిన గంగాభవానీ ఈ నెల 1వ తేదీనే గుజరాత్‌కు వెళ్లి విధులకు హాజరైంది. ఇంతలోనే గంగాభవానీ ఇంతటి ఆఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.