సుబేదారి, జనవరి 22: ఆటో డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని అదాలత్ జంక్షన్ సమీపంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడికొండకు చెందిన ఆటోడ్రైవర్లు మాచర్ల రాజ్‌కుమార్(36), ఏనుగు వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాజ్‌కుమార్ ఇంటి నుంచి ఆటో నడుపుకోవడానికి హనుమకొండకు బయలుదేరగా వెంకటేశ్వర్లు గమనించి మడికొండ నుంచి ఆటోలో ఫాలో అయ్యాడు. అదాలత్ జంక్షన్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న క్రమంలో వెంకటేశ్వర్లు అడ్డగించాడు. దీంతో ఇద్దరూ ఆటోలు దిగి ఇద్దరూ గొడవపడ్డారు. వెంకటేశ్వర్లు పక్కా ప్లాన్‌తో వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌ను విచక్షణా రహితంగా కడుపులో పొడవడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.