బాసర, నవంబర్ 12 : స్వాతిప్రియ ఆత్మహత్యను నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం కార్యకర్తలు మంగళవారం సాయంత్రం ట్రిపుల్ ఐటీ వద్ద ధర్నా నిర్వహించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు శాంతియుతంగా వచ్చిన సంఘం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటామని, తమకు లోపలికి అనుమతివ్వాలని కోరారు. అయినా అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి గోడదూకి విద్యార్థుల సమస్యలను తీర్చాలన్నారని గుర్తుచేస్తూ.. ముఖ్యమంత్రి అయి 11 నెలలు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ట్రిపుల్ ఐటీపై పట్టింపు లేదని మండిపడ్డారు. లోపలికి అనుమతించక పోవడంతో గేటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.
స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తలు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఏబీవీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎస్‌వో (చీఫ్ సెక్రటరీ ఆఫీసర్)గా పనిచేస్తున్న రాకేశ్‌ను విధుల నుంచి తొలగించారు. పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విధుల నుంచి రిలీవ్ చేశారు.