BRSV | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగుల కన్నీటికి కారణమైందంటూ మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో నిరుద్యోగులే తగిన బుద్ధి చెప్తారని వారు పేర్కొన్నారు.]
మరో వైపు ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. ల్యాండ్ స్కేప్ గార్డెన్లోకి ప్రవేశించిన పోలీసు బలగాలు.. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారు. కనిపించిన విద్యార్థిని కనిపించినట్టే అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నుంచి పోలీసులు బలవంతంగా సెల్ఫోన్లు లాక్కున్నారు. ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారంటూ విద్యార్థులు పోలీసులను నిలదీశారు. దీంతో విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
పోలీసు బలగాలను చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని గుర్తు చేశారు. అసలు యూనివర్సిటీలోకి పోలీసులకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. మేం ఉగ్రవాదులం కాదు.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని నిలదీశారు. తమ ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి.. తమపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్వీ నాయకులు
బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/s3LS97Y0GU
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024