ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 26: రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శ్రీనునాయక్ డిమాండ్ చేశారు. బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల చదువు అటకెక్కుతున్నదని వాపోయారు. బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ‘ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు’ ఉద్యమాన్ని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. హబ్సిగూడలోని ఒమేగా కళాశాల విద్యార్థులు ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు పంపించారు. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో యువ వికాస్ పథకం ద్వారా రూ. 5లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను సైతం చెల్లించడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రీయింబర్స్‌మెంట్‌కు కాంగ్రెస్ సర్కార్ తూట్లు
కాంగ్రెస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంకు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారే తూట్లు పొడుస్తున్నదని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకే విడతలో రీయింబర్స్మెంట్ ఇస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు చేస్తున్నదేంటి? అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని శనివారం విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ జీహెచ్ఎంసీ ఆఫీసు నుంచి ర్యాలీగా బయల్దేరగా, బీఆర్కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రూ.7650 కోట్ల ఫీజు బకాయిలు రాకపోవడంతో పేద విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.