హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేక వన్నె పులి అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి, ద్రోహం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. బడుగు బలహీనవర్గాలవారు అమాయకులని సీఎం రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారని, కానీ, రేవంత్‌ను బీసీలు వదిలిపట్టే ప్రసక్తే లేదని, తగిన శాస్తి చేస్తారని, 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుంటే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్లో ఏడుగురు బీసీలకు పదవులు దక్కాల్సి ఉంటే ఆ మేరకు న్యాయం జరుగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రధానిపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు.
జీవో 9పై హైకోర్టులో కేసువేసిన మాధవరెడ్డిని మంత్రులు ఎందుకు కలవడం లేదని, ఆయన ను కోర్టుకు వెళ్లకుండా సీఎం, మంత్రులు ఎందుకు ఆపలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ నిలదీశారు. బీసీలకు కోటాపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఏ కిషోర్‌గౌడ్, ఏ వెంకటేశ్వర్‌రెడ్డి, దత్తాత్రేయ పాల్గొన్నారు.