BRSV | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో దివ్యాంగ పరిశోధక విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన దివ్యాంగ పరిశోధక విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. మెస్ బిల్లుల అక్రమ వసూలను నిరసిస్తూ ఓయూ పరిపాలన భవనంలో దివ్యాంగ పరిశోధక విద్యార్థులు పరిపాలన భవనంలోని వీసీ చాంబర్లో గురువారం సాయంత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు కూర్చున్న వారిలో ఒకరు స్పృహ తప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
శుక్రవారం ఉదయం పోలీసులను పిలిపించి దివ్యాంగులనే కనీస కనికరం లేకుండా బలవంతంగా అరెస్టు చేయించారని దుయ్యబట్టారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి వర్సిటీ అధికారుల నుంచి వివరణ కోరాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ సమ్మతితోనే వర్సిటీ అధికారులు దివ్యాంగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తమ దగ్గర నుంచి అధికారులు అక్రమంగా మెస్ బిల్లులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతోనే వారు ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని వివరించారు.
దివ్యాంగులకు ఉచిత హాస్టల్, మెస్ వసతి కల్పించాలని నిబంధనలు ఉన్నా, వాటిని పట్టించుకోకుండా మెస్ బిల్లులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిశోధనలు పూర్తిచేసి పరిశోధన గ్రంథాన్ని సమర్పించే సమయంలో తప్పకుండా మెస్ బిల్లులను పూర్తిగా చెల్లించే వరకు అధికారులు సంతకాలు పెట్టడం లేదని దుయ్యబట్టారు. దేశంలో ఏ యూనివర్సిటీలోనూ లేని విధంగా ఓయూలో పరిశోధనా గ్రంథం సమర్పించేందుకు అధికారులు విధించిన గడువు సమీపిస్తుండగా, మరోవైపు మెస్ బిల్లులు పూర్తిగా చెల్లించాల్సి రావడంతో దివ్యాంగులు దిక్కుతోచని స్థితిలో గందరగోళానికి గురవుతున్నారని వివరించారు. కనీస మానవతా దృక్పథం లేనట్లుగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధికారుల మూర్ఖపు వైఖరి కారణంగా దివ్యాంగ విద్యార్థులు తీవ్ర మానసికక్షోభకు లోనవుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఇతర విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.