Group-1 | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన చేపట్టి టీజీపీఎస్సీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, ఇన్‌ఛార్జి జట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర రాజేందర్ మాట్లాడుతూ.. అనేక సెంటర్లో అక్రమాలకు జరిగినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు అందరికీ 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోఠి మహిళా కళాశాలలో మహిళా అభ్యర్థులకి ప్రత్యేకంగా కేటాయించిన సెంటర్లో 71 మంది ఎంపికయ్యారు. మిగిలిన 26 సెంటర్లలో 139 మంది ఎంపికయ్యారు, ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.
563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు టీజీపీఎస్సీ షీల్డ్ కవర్లో పేర్కొంది. ఇంగ్లీష్‌లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారు. తెలుగులో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అభ్యర్థులు రీ-కౌంటింగ్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు మార్కులు తగ్గాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో నాటి కమీషన్ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని పోరాడినం, ఇప్పుడున్న కమీషన్ అదే విధానాన్ని అనుసరించటం వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా హైకోర్ట్ డివిజన్ బెంచికి, సుప్రీంకోర్టుకి వెళ్లవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కలకోట్ల సుమన్, హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్స్ గండ్రకోట రాకేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు గొల్లపల్లి వీరస్వామి, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కోరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.