రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) నేడు సిరిసిల్లకు రానున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 37వ వార్డు, వెంకంపేటకు చెందిన నేతన్న దంపతులు బైరి అమర్, స్రవంతి దంపతులు శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 7 గంటలకు వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించనున్నారు. కాగా, రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా కేంద్రంలోని 37 వ వార్డు వెంకంపేటకు చెందిన బైరి అమర్ (41), స్రవంతి (37) మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి 13 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం వలస వచ్చారు.
అమర్ రూ.20 లక్షల బ్యాంకు లోను తీసుకుని ఓ చిన్నపాటి ఇల్లు కొనుక్కున్నాడు. అందులో రెండు జోడీల సాంచాలు వేసుకుని ఉపాధి పొందుతున్నా డు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు నేచాడు. కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో సాంచాలను అమ్ముకుని, ప్రత్యామ్నాయంగా బెడ్షీట్ల తయారీ వ్యాపారం చేస్తున్నాడు. ఇంటి కోసం బ్యాంకు లోనుతోపాటు వ్యాపారం విస్తరించేందుకు తెలిసిన వాళ్ల వద్ద అప్పులు చేశాడు.
అప్పులు ఇచ్చినవాళ్లు డబ్బుల కోసం తీవ్రంగా వేధించడంతో మనస్తాపం చెందారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు లహరి(15), శ్రీవల్లి (14), కొడుకు దీక్షిత్ (12) ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. భార్యాభర్తలు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలిచివేసింది.