తెలంగాణలో కరువు పరిస్థితులు నానాటికీ తీవ్రమవుతున్నాయి. వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి హెచ్చరించేదాకా కరువు పరిస్థితులపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టని ఫలితం ఇప్పుడు తీవ్ర విపరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తున్నది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తున్నది. కాలనీలు, వీధులు, పట్టణాలు, గ్రామాల్లో మళ్లీ ట్యాంకర్ల రొద వినిపిస్తున్నది.
కేసీఆర్ హెచ్చరించిన తర్వాత ప్రభుత్వం మేల్కొని మొన్న లక్ష్మీపూర్ సర్జ్‌పూల్ నుంచి సాగునీరు, నాగార్జునసాగర్ నుంచి తాగు నీళ్లు విడుదల చేసింది. బుధవారం తాగునీటి సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష జరిపారు. సమస్యను గుర్తించి మార్గనిర్దేశం చేయడానికి 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య ఉందంటూ ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో అధికారులు అప్పటికప్పుడు కదిలారు.
అయితే ఇవన్నీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నాయనే విమర్శ వ్యక్తమవుతున్నది. గోదావరి ఫౌపాణహిత) నుంచి ముందే నీళ్లు ఎత్తిపోయని ఫలితం రాష్ర్టాన్ని దుర్భిక్షంలోకి నెట్టే ప్రమాదం ఉన్నదని, తాగు, సాగునీటి సమస్య మరింత తీవ్రం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1.67 2023 మార్చితో పోలిస్తే ఈ మార్చిలో తెలంగాణ భూగర్భ జలమట్టం (గ్రౌండ్ వాటర్ టేబుల్) సగటున 1.67 మీటర్లు పడిపోయింది.
రాష్ట్రంలోని దాదాపు 201 మండలాల్లో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. 201
భూగర్భ జలమట్ట పతనం 0.01 మీటర్ల నుంచి 15.2 మీటర్ల వరకు ఉన్నది.
401 మహబూబ్‌నగర్ జిల్లాలో 4.01 మీటర్లకు పడిపోయిన జలమట్టం
తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులుగా 10 మంది ఐఏఎస్‌లు
మేం 24 గంటలు తాగునీరు, సాగునీరు, విద్యుత్తు ఇవ్వాలని ఆలోచించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 24 గంటలూ ఎవరిని దెబ్బకొట్టాలి? ఎవరిని బెదిరించాలి? ఢిల్లీకి ఎన్ని సూట్‌కేసులు పంపాలి? అన్న ఆలోచనతోనే ఉన్నది.
-కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యంతో సాగునీరు, తాగునీటి కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. పల్లెలు తాగునీటికి తండ్లాడుతున్నాయని, పట్టణాల్లో గొంతెండుతున్నదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల నీటి ట్యాంకర్లను వాడాల్సి వస్తున్నందున, ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం గారూ.. హైదరాబాద్ ప్రజలు మీకు ఓటు వెయ్యలేదు. ఆ విషయం మీకూ తెలుసు. అందుకే హైదరాబాద్ ప్రజలపై పగబట్టినవా? ట్యాంకర్లు బుక్ చేసిన 12 గంటల్లో తాగునీటి అందిస్తున్నామని, అయినా తమను అభినందిస్తలేరని అంటున్నవ్.
అసలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఎందుకు వస్తున్నది? జలమండలిలో మార్చిలో 1.30 లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఇంకా ప్రైవేటు ట్యాంకర్లు లక్ష దాటాయి. ఈ ట్యాంకర్లకు డబ్బులు ఎవరు కడుతారు? వాటర్ ట్యాంకర్లు ఉచితంగా ప్రజలకు అందజేయాలి. మేం 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తే, వాటికి ఇప్పుడు బిల్లులు పంపుతున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని సీఎంను కేటీఆర్ డిమాండ్ చేశారు. అవసరమైతే జలమండలి వద్ద ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కావాల్సినంత నీరు అందుబాటులో ఉన్నా, సరైన నిర్వహణ లేకపోవటంతో పంటలు ఎండిపోయాయని, నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్‌పై పెట్టిన దృష్టి వాటర్ ట్యాపింగ్ పెడితే ఈ కష్టాలు ఉండవని విమర్శించారు.
‘కేసీఆర్ అంటేనే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లే మిగులుతాయని ఎన్నికల ప్రచారంలో చెప్పాం. అన్నట్టుగానే ఇప్పుడు ఆ మాటలు నిజయమ్యాయి. రాష్ట్రం మొత్తం దాహంతో కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మంచినీళ్లు మహాప్రభో అని జనం అడుగుతుంటే.. రేవంత్‌రెడ్డి గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో బిజీగా ఉన్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.
సీఎం రేవంత్‌కు ధన వనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ధ, ప్రజలకు జల వనరులను తరలించటంలో లేదు.
– కేటీఆర్
‘కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించాలని, కాళేశ్వరం కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ఒక స్కాం అని, మేడిగడ్డ మేడిపండు అయ్యిందని విషప్రచారం చేశారు. మరి కేసీఆర్ బయలుదేరగానే గాయత్రి, నందిపంప్హౌజ్లు ఎలా స్టార్ట్ అయ్యాయి? కాళేశ్వరం ప్రాజెక్టులో జలపరవళ్లు ఎట్లా దుంకుతున్నాయి? నీళ్లు ఉండీ ఇవ్వటం చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్‌ది. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇస్తారా? మేమే గేట్లు ఎత్తాలా? అని నిలదీస్తే సాయంత్రంలోపు నీళ్లు వదిలారు’ అని కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కడ పంట ఎండిపోతున్నదో, ఎక్క డ నీటి కొరత రాబోతున్నదో తామే చెప్తే, సీఎం రేవంత్, ఉద్యోగులు, అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం ఉండి ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ జాబితాను సీఎంకు పంపిస్తున్నామని.. వారికి రూ.25 లక్షల చొప్పున పరిహా రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెయ్యాలని నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘రేవంత్‌రెడ్డి లీకు వీరుడు. నా క్యారెక్టర్ పాడు చేసేపనిలో ఉన్నాడు. నేనెవరో హీరోయిన్ను బెదిరించానని ఒక మంత్రి అంటున్నారు. ఇలాంటి అడ్డమైన, చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా, సీఎం అయినా తాట తీస్తా. లీగల్‌గానే చూసుకుంటాం’ అని తేల్చిచెప్పారు. ‘2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అప్పటి కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, డాక్టర్ గడ్డం వివేక్ అప్ప టి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. అంటే.. 2004 నుంచి జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌లపై విచారణ చేయాలి.
ఇదే శివధర్‌రెడ్డి ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. మహేందర్‌రెడ్డి 2004లో ఇంటలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనే డీజీపీగా పనిచేశారు. రవి గుప్తా ఆనాడు హోం సెక్రటరీ. ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారు బాధ్యులు కాదా?’ అని ప్రశ్నించారు. కడియం శ్రీ హరి, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవులు పోవ టం గ్యారెంటీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, కేపీ వివేకానంద, బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి గారూ! పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి, ఫోన్‌ట్యాపింగ్‌లపై కాదు.. వాటర్ ట్యాపింగ్ మీద దృష్టిపెట్టండి
– కేటీఆర్