KTR | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారుకు బుల్డోజర్కు మధ్యనే పోటీ ఉందని, ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీని పచ్చడి పచ్చడి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వెంగళ్రావ్ నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎవరికైనా మంచి జరిగిందా.. అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆరు గ్యారెంటీలు యాదికున్నాయా..? కేసీఆర్ 2 వేల పెన్షన్ ఇస్తే.. నేను 4 వేల పెన్షన్ ఇస్తా అన్నాడు. 18 ఏండ్లు నిండిన మహిళలకు 2500 ఇస్తా అన్నాడు.. రాలేదు. అత్తకు 4 వేలు కోడలికి రెండున్నర వేలు రాలేదు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు.. లేదు. వికలాంగులు ఉంటే 6 వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు అవి కూడా రాలేదు. ఇవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తాని డైలాగులు కొట్టి, ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాడు అని కేటీఆర్ తెలిపారు.
మరి ఈ రెండేండ్లలో హైదరాబాద్ అభివృద్ధిని దివాళా తీయించారు. రియల్ ఎస్టేట్ను కుదేలు చేసి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారకుడయ్యాడు రేవంత్ రెడ్డి. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చివరకు 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఎన్నిక మాగంటి సునీతకు మాత్రమే కాదు.. ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టిన పార్టీకి, మీ కోసం గల్లా పట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. ఇది ఆషామాషీ ఎన్నిక కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమైతది అంటే.. రూ. 2500, పెన్షన్లు, రూ. 6 వేలు ఇవ్వకున్నా ఓట్లు వేస్తున్నారు. నేను ఎందుకు తులం బంగారం, స్కూటీలు ఇవ్వాలని రేవంత్ అనుకుంటాడు. మోసం చేసినా నన్నే గెలిపిస్తున్నారు అని విర్రవీగుతాడు. ఈ బస్తీల్లో ఉండే అన్నదమ్ముళ్లను, అక్కాచెల్లెళ్లను అడుగుతున్నా.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా..? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు.. బస్తీల మీదకి జేసీబీలు పంపి పేదోళ్ల ఇండ్లు కూలగొడుతున్నాడు. హైడ్రా దందా పెట్టి గరీబోళ్ల ఇండ్లు ఇష్టమొచ్చినట్లు కూలగొడుతున్నడు. అన్ని బస్తీలకు విజ్ఞప్తి చేస్తున్నా.. హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావొద్దంటే.. 11న కాంగ్రెస్ను పచ్చడి పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గాలు ఆగుతాయని కేటీఆర్ అన్నారు.
గరీబోళ్లు అలకగా దొరికారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వివేక్, పట్నం మహేందర్ రెడ్డి, అరికెపూడి గాంధీ వద్దకు హైడ్రా పోదు. హైడ్రా ఏం తప్పు చేసిందంటువన్నవ్.. నీ ప్రభుత్వానికి సిగ్గు ఉంటే వీళ్లవి కూలగొట్టు. ఇంత కిరాతకం చేస్తుంటే ఏం తప్పు చేసింది అని అడుగుతున్నావ్. హైడ్రాను అడ్డుంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ బిల్డర్లు, భూ యజమానుల వద్ద డబ్బులు తీసుకుని ఢిల్లీకి మూటలు పంపుతున్నడు. కారు, బుల్డోజర్ మధ్య పోటీ జరుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.