మానకొండూర్ రూరల్, నవంబర్ 12 : సిరిసిల్ల్లలోని 17వ బెటాలియన్ కానిస్టేబుల్ రాధారపు శ్రీనివాస్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన బెటాలియన్ కానిస్టేబుల్ రాధారపు శ్రీనివాస్ ఇటీవల సిరిసిల్లలో ఆందోళన చేయగా.. ప్రభుత్వం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. శ్రీనివాస్ చెల్లెలు కావ్యశ్రీ వివాహం ఈ నెల 14న ఉంది. రెండ్రోజుల కింద సిరిసిల్ల పర్యటనకు వచ్చిన కేటీఆర్‌ను శ్రీనివాస్ కలిసి తన బాధను విన్నవించగా.. వెంటనే ఆయన శ్రీనివాస్ తల్లి సరోజనతో ఫోన్లో మాట్లాడారు. ‘అమ్మా మీ కుటుంబానికి అండగా ఉంటా. బిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందజేస్తా. నీ కొడుక్కు మళ్లీ ఉద్యోగం వచ్చేలా కొట్లాడుతా’ అని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కావ్యశ్రీ వివాహం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పంపించగా.. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతోపాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు శ్రీనివాస్ ఇంటికెళ్లి అందజేశారు.