KTR | హైదరాబాద్ : రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పలేదు కదా..? అని రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం, ఎమ్మెల్యేలందరూ నిన్న ఢిల్లీకి పోయారు. ఒక ముఖ్యమంత్రి, దమ్మున్న నాయకుడు ఢిల్లీకి పోతే.. ఏం చెప్పలా.. బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్న.. నేను రిజర్వేషన్లు తీసుకుని వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఆనాడు ఎట్ల చెప్పిండు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్న. తిరిగి తెలంగాణలోనే కాలు పెడుతా అని అన్నడు. తెచ్చిండా..? లేదా..? అది దమ్మున్న నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి ఏమన్నడు. అది చేస్తా ఇది చేస్తా అని పోయిండు. ఇక అక్కడ ఒకరికి మించి ఒకరు ఉపన్యాసాలు ఇచ్చి మైకులను పగులగొట్టిర్రు. ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీని వంగపెట్టి గుద్దితేనే రిజర్వేషన్లు వస్తాయని అంటడు. ఈ గుద్దుడు తన్నుడు ఏంది.. ఈ పనికి ఢిల్లీకి పోతారా..? ఎవరన్నా..? పోయి ఏం సాధించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మీరే చెప్తిరి. అది కూడా ఎన్నికల్లో కాదు.. విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే రిజర్వేషన్లు ఇస్తాని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పలేదు కదా..? ఆ రోజేమో ఓట్ల కోసం బీసీలను మభ్య పెట్టావు. బీసీ సబ్ ప్లాన్ తెస్తా. చట్టబద్ధత తీసుకువస్తా అని చెప్పినవ్ మరి ఎందుకు చేయలేదు. ఇది నీ చేతుల పనే కదా..? రిజర్వేషన్లు అంటే ఢిల్లీ చేతుల ఉంది. బీసీల బడ్జెట్ ఎక్కడ పోయింది. బీసీలకు కాంట్రాక్టులు వచ్చాయా.. అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పాస్ చేయొచ్చు కదా..? ఇవన్నీ నీ చేతుల్నే ఉన్నాయి కదా..? ఇవన్నీ ఇవ్వకుండా ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తా అని పోయిండు. కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తా అని పోయిండట. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? ఇంత విచిత్రమైన మనిషి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.