KTR | ఒకవైపు టీచర్లపై లాఠీ ఛార్జీలు, మరోవైపు విద్యుత్ సంస్థ ఉద్యోగులపై నిందలు.. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులతో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయించుకోవాలని.. ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఆ పనిచేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తే ఏమొస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య ఉన్న తేడాను వివరించారు.
కేసీఆర్ పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపినప్పటికీ.. ఎన్నాడూ ఒక్క పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఒక పొల్లు మాట్లాడలేదని కేటీఆర్ తెలిపారు. ఎందుకంటే వాళ్లతో తమకు ఉన్నది పేగు బంధమని స్పష్టం చేశారు. ఉద్యమంలో కలిసి పనిచేశామని.. సకల జనుల సమ్మె చేసినా.. పెన్ డౌన్ చేసినా.. సింగరేణిలో స్తంభింపజేసినా.. ఆర్టీసీలో చక్రం తిప్పకుండా ఆపినా.. ఉద్యోగులతో బీఆర్ఎస్ పార్టీకి ఉండేది పేగుబంధమని తెలిపారు. అందుకే ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమపూర్వకంగా ఉన్నాం తప్ప నిందించలేదని స్పష్టం చేశారు. అదే రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్.. 7700 మెగా వాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచారని కేటీఆర్ తెలిపారు. విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం అద్భుతంగా ఉంది కాబట్టే అక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చామని పేర్కొన్నారు. అది గుర్తించకుండా.. కామన్సెన్స్ లేకుండా తమ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా, ఏ ఉద్యోగులు అయితే కర్తవ్యాన్ని నిర్వర్తించారో.. వాళ్లను నిందిస్తూ ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలకు పాల్పడతున్నారని విమర్శించారు. ఆయన విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. ముఖం బాగోలేకపోతే.. అడ్డం పగలగొట్టినట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ సమర్థంగా నడిపారో.. ఏ డిస్కంలను అయితే నడిపారో.. శ్రీశైలంలో పంప్‌హౌజ్ మునిగిపోతే కూడా, నష్టం జరిగితే కూడా అహర్నిశలు ఇదే ఉద్యోగులను శ్రమించారన్నారు. విద్యుత్ ఉద్యోగులను నిందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం తగదన్నారు. ఇకనైనా తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే గావుకేకలు, పెడుబొబ్బలు పెట్టారని తెలిపారు. అప్పుడు పోలీసులను తిట్టిండు అని.. ఉద్యోగులను తిట్టిండని.. కొంతమంది తొత్తులు అని విమర్శించారని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులను తిట్టారని.. బిహారీ గ్యాంగులు అంటూ తిట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అవే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రిలా మాట్లాడాలని సూచించారు.
తన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ఒక ప్రభుత్వ అధినేత నమ్మకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. నారాయణఖేడ్‌లో టీచర్ల మీద దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలింగ్ డ్యూటీ చేసినందుకు దానికి సరిపడా వేతనం ఇవ్వాలి. అది ఇవ్వకపోగా.. అడిగినందుకు వాళ్ల మీద లాఠీ ఛార్జీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు టీచర్లపై లాఠీ చార్జీలు, విద్యుత్ ఉద్యోగులపై నిందలు.. ఇది కరెక్టేనా.. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా అని మండిపడ్డారు. ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులతో సమర్థవంతంగా పనిచేయించుకోవాలి.. ప్రజలకు సేవ చేయాలి.. ఆ పనిచేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు.