KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో.. వారికి వారే తెలుసుకోలేని పరిస్థితి ఉందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జడ్చర్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం ముగిసిన అనంతరం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విలేకరులు ప్రశ్నించగా కేటీఆర్ ఈ విధంగా బదులిచ్చారు.
నిన్న గాక మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అవును ఆ పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారు అని స్పష్టంగా చెప్పారు. మరి పీసీసీ ప్రెసిడెంటే అఫ్రూవర్‌గా మారిన తర్వాత, ఆయనే నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు..? చర్చ ఎందుకు..? ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు స్పీకర్‌కు మొహమాటం ఎందుకు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటుంది అంటే ప్రజలను, మీడియాను, న్యాయ వ్యవస్థను కూడా చిన్నచూపు చూస్తూ వాళ్లతో చిలిపిఆటలాడి తప్పించుకోవచ్చన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారారు. ఇవాళ ఆయనది చాలా విచిత్రమైన పరిస్థితి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ పీసీసీ ప్రెసిడెంట్ అఫ్రూవర్‌గా మారారు. అలాగే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరానని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఆన్‌రికార్డు మీడియాతోనే చెప్పారు. ఇంకా దీన్ని చర్చించడానికి, పరిశోధించడానికి ఏం లేదు. వెంటనే వారిపై వేటు వేయాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. కోర్టు తీర్పును గౌరవించాలని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే.. బీఆర్ఎస్ కార్యాలయానికి ఎందుకు రావడం లేదు..? బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు..? బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు..? ప్రజలు పిచ్చివాళ్లు అనుకుని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అగౌరవ పరచడం కాకపోతే ఇంకేంటి..? నిన్న మంత్రుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ తిడుతుంటే పళ్లు ఇకిలించి కూర్చున్నది ఎవరు.. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డినా.. కాంగ్రెస్ పార్టీలో చేరినా కృష్ణ మోహన్ రెడ్డినా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే రెండే లింగాలు ఉంటాయి.. ఒకటి స్త్రీ లింగం.. మరొకటి పు లింగం.. వీళ్లు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది మన కర్మ. ఇలాంటి వారికి ప్రజలు ఓటేసి గెలిపించుకున్నందుకు కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఉల్టా చేస్తే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.