KTR | హైదరాబాద్ : మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత అని ఆయన ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకొని చేనేత ప్రపంచంలో వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నా చేనేత అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు వందనం అని కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో సాలెల మగ్గం సడుగులిరిగింది. బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు పునర్వైభవం వచ్చిందన్నారు. పనులు లేక, పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను, వినూత్న పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు.
చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ
మరోసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.