హైదరాబాద్ మే 12 (నమస్తే తెలంగాణ): జీవితాంతం కార్మికుల హక్కులు, వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతిగా నిలిచిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం కంకణబద్ధులమవుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న గొప్ప నేత నాయిని అని కీర్తించారు. స్వరాష్ట్ర సాధన కోసం 22 ఏండ్ల పాటు కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో కీలకభూమిక పోషించారని గుర్తుచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి 85వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయిని చిత్రపటానికి కేటీఆర్, మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కుత్బుల్లాపూర్, గోషామహల్ ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, ముఠాగోపాల్, నాయిని తనయుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, తుల ఉమ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తామందరికీ పెద్దన్నలా నాయిని దారిచూపారని గుర్తుచేశారు. వీఎస్టీ ఫ్యాక్టరీలో కార్మిక నేతగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి హక్కులను సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయిని ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయించారని తెలిపారు.
తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న మోసానికి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న కేసీఆర్ ఆదేశాలను శిరసా వహించి అమెరికా నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్, స్పీకర్‌కు పంపించి నిబద్ధతను చాటుకున్నారని గుర్తుచేశారు. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఆస్తులను కాకుండా పేరు, గౌరవం సంపాదించిన అరుదైన నాయకుడని ప్రశంసించారు. ముషీరాబాద్ నియోజకవర్గ, హైదరాబాద్ ప్రజలకు ఎనలేని సేవలందిచారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచారని చెప్పారు. నాయిని సేవలను గుర్తించిన కేసీఆర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టి సమున్నతంగా గౌరవించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కొందరు నేతల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి చెప్పారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేసిన నాయిని విలువలు, నిబద్ధతకు మారుపేరని కొనియాడారు. రాంమనోహర్ లోహి యా, జయప్రకాశ్ నారాయణ్, జార్జ్ ఫెర్నాండేజ్ తదితర మహానేతల స్ఫూర్తితో పేదలు, కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమించారని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, శ్రీనివాస్‌యాదవ్, రవికుమార్, రాకేశ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.