KTR | హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముందుగా అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేనే.. అందుకే ఎమ్మెల్యే స్థానాలను పెంచాలన్నదే మా పార్టీ అభిప్రాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడున్న ఎంపీ స్థానాలని అలానే కొనసాగించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం చర్చా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల తరఫున వారి సమస్యలను పార్లమెంట్లో మరింత సమర్థవంతంగా వినిపించడానికే రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ప్రతి రాష్ట్రానికి ఉన్న జనసంఖ్య ఆధారంగా పార్లమెంటులో ఆ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో గతంలో పునర్విభజన జరిగేది. అందుకే గతంలో ప్రతి 10 సంవత్సరాలకు జనగణన, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగేది. అయితే జనాభా విపరీతంగా పెరగడం కారణంగా 1971లో రాజ్యాంగ సవరణ చేసి భారత పార్లమెంటు స్థానాలను 543 దగ్గర ఫ్రీజ్ చేశారు. 30 సంవత్సరాల తర్వాత మళ్లీ నియోజకవర్గ పునర్విభజన చేస్తామన్నారు. ఈలోపు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణలో పకడ్బందీగా అమలు చేశారు. అందుకే 1948లో 26 శాతంగా ఉన్న సౌత్ ఇండియా పాపులేషన్ 19 శాతానికి తగ్గింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
కానీ ఉత్తర భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా అమలు చేయలేక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 1950 నుంచి ఇప్పటివరకు 239 శాతం జనాభా పెరిగింది. అదే కేరళలో 69 శాతం మాత్రమే జనాభా పెరిగింది. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ఫ్యామిలీ ప్లానింగ్‌ను అద్భుతంగా అమలుపరిచిన కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తక్కువ సీట్లు కేటాయిస్తామని అనడం అన్యాయం కాదా? ఉత్తరప్రదేశ్ లాంటి ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా అమలు చేయని రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని పెంచి దక్షిణాదికి తగ్గిస్తామనడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదు. నియోజకవర్గాల పునర్విభజనలో జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. అందుకే మొన్న చెన్నైలో జరిగిన సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేశామని కేటీఆర్ తెలిపారు.
ప్రధానమంత్రిని ఉత్తర భారతదేశం నిర్ణయించాల్సి వస్తే.. రేపు ఆ ప్రభుత్వం ఆ ప్రాంతం ప్రయోజనాలకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుంది కానీ దక్షిణ భారతదేశం అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్ని మేము నమ్మడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు చేయలేదు. కానీ ఎవరు అడగకముందే వారి రాజకీయ ప్రయోజనాల కోసం జమ్ము కాశ్మీర్, అస్సాంలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచారు. ఎక్కడైతే భారత ప్రభుత్వం హామీ ఇచ్చిందో పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసిందో అక్కడ మాత్రం ఎమ్మెల్యే స్థానాలను పెంచలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తుంది. అందుకే మేము పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది మూకస్వామ్యం లేదు. తనకు ఇష్టం వచ్చినట్లు బీజేపీ చేస్తామంటే కుదరదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.