KTR | ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. రావాల్సింది ప్రశ్నించే స్వరాలు అని అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రశ్నించే రాకేశ్రెడ్డి వంటి ఉత్సాహవంతుడు, యువకుడైన వ్యక్తి శాసనమండలికి ఎన్నిక కావాలని తెలిపారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత నాలుగు పర్యాయాలు తమకు అవకాశమిచ్చారని కేటీఆర్ అన్నారు. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని.. రావాల్సిన ఉద్యోగాలు, వసతుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వంచించిందో చూస్తూనే ఉన్నారని.. తొమ్మిదిన్నరేండ్లలో విద్యా వ్యాప్తికి, మౌళిక వసతుల కల్పనకు పనిచేసిందో చూశారని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, ప్రతి జిల్లాలో విద్యావ్యాప్తికి, విద్యావంతుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు దేశంలోనే అత్యధికంగా పే స్కేలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి బొంకుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిచిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఈప్రభుత్వానికి ఐదు నెలల కాలపరిమితి ముగిసిందని.. ఇంకా ఆరేడు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు కావాల్సి ఉందన్నారు. ఈ ఉద్యోగాలు భర్తీ కావాలంటే.. ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే.. ప్రశ్నించే రాకేశ్ రెడ్డి ఉత్సాహవంతుడైన యువకుడు శాసనమండలిలోకి రావాలని పిలుపునిచ్చారు.
ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. రావాల్సింది ప్రశ్నించే స్వరాలు అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలని అన్నారు. శాసన మండలిలో ఒక యువకుడు, ఉత్సాహవంతుడైన రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా, మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని.. ఎప్పుడు ఎవర్ని నిందిస్తారో తెలియదని అన్నారు. గతంలో నల్గొండలో నయీంను చూశామని.. ఇటువంటి వ్యక్తులకు చట్టసభల్లో అవకాశమిస్తే అలాంటి వ్యక్తులను తయారు చేసినట్టు అవుతుందని విమర్శించారు.