Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లిన నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేశారు. అక్రమ అరెస్టుపై ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపై పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.
నరేందర్ రెడ్డి సతీమణి శృతికి కూడా కేటీఆర్ కాల్ చేసి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండంగా ఉంటుందని తెలిపారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కోర్టులో న్యాయపోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఖండించారు. తన కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డితో కలిసి ఫిలింనగర్లోని పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయన సతీమణి శృతికి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజల తరఫున మాట్లాడటమే నరేందర్ చేసిన తప్పా అని నిలదీశారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు
ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు https://t.co/DIsZJRkZmP pic.twitter.com/VUSWFmgqYC
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024