KTR | హైదరాబాద్ : దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేసిన “తెలంగాణ సింహగర్జన”కు సరిగ్గా 24 ఏళ్లు అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. కరీంనగర్ వేదికగా ఉద్యమ రథసారథి కేసీఆర్ ఆనాడు పూరించిన సమరశంఖం ఢిల్లీ వరకూ ప్రతిధ్వనించిన అపూర్వ సందర్భమది అని పేర్కొన్నారు.
తెలంగాణ నలువైపుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ఆ జనప్రవాహం.. ఓ సముద్రాన్నే తలపించిన చారిత్రక సన్నివేశమది. తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని ఎంతో మంది అడుగడుగునా అవమానించినా, రకరకాలుగా అవహేళన చేసినా వెన్నుచూపని ఆ ధీరోదాత్తుడి సంకల్పం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఓ చెరగని సంతకం. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, ఒక్కరితో మొదలైన ఆనాటి ప్రయాణం అనుకున్న గమ్యాన్ని ముద్దాడటమే ఒక చారిత్రక విజయమైతే.. ఇక ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడై, సాధించిన తెలంగాణను పదేళ్లలోనే దేశానికే దారిచూపి దీపస్తంభంలా తీర్చిదిద్దిన ఆ దార్శనికత.. ప్రతి తెలంగాణ బిడ్డకు ఎప్పటికీ గర్వకారణం అని కేటీఆర్ పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అని కేటీఆర్ నినదించారు.