హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక జాతీయస్థాయి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ నెల 11న కోయంబత్తూర్‌లోని కుమారగురు ఇన్స్టిట్యూషన్స్లో జరగనున్న 10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కేటీఆర్‌కు ఎఫ్ఎంఏఈ ఆహ్వానం పంపింది. ఆయన నాయకత్వ పటిమ, మోటార్ స్పోర్ట్స్‌లో నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చి తెలంగాణను గ్లోబల్ మోటార్స్ స్పోర్ట్స్ మ్యాప్‌పై నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన పాత్ర అభినందనీయమని కొనియాడింది. సుస్థిరమైన మొబిలిటీ, అడ్వాన్స్డ్ మానుఫాక్చరింగ్, ఇన్నోవేషన్ ఎకో సిస్టంలను ప్రోత్సహించడంలో ఆయన చూపిన చొరవ గర్వకారణమని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇంజినీర్లలో స్ఫూర్తి నింపిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడింది. ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా 101 కాలేజీల నుంచి 70కి పైగా విద్యార్థి బృందాలతో పాటు మొత్తం 1300 మందికి పైగా యువ ఇంజినీర్లు పాల్గొననున్నారు. ఈ పోటీ భారతదేశంలోని అత్యున్నత విద్యార్థి-కేంద్రీకృత ఇంజినీరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది పరిశ్రమలు, విద్యారంగాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో కీలకభూమిక పోషించనున్నది. భవిష్యత్తు ఆటోమోటివ్ టెక్నాలజీలకు భారతదేశాన్ని కేంద్రంగా నిలబెట్టే లక్ష్యంతో ఎఫ్ఎంఏఈ ముందుకెళ్తున్నది.