KTR | తెలంగాణ మాజీ ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025’ సదస్సులో ఆయనకు కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సు నవంబర్ 10 నుంచి 12 వరకు కొలంబోలోని ‘ది కింగ్స్బరీ హోటల్’లో జరుగనున్నది. శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, జీఈటీఎస్ శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్ఏ హిల్మీ కేటీఆర్కు ఆహ్వానాన్ని పంపారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.
డాక్టర్ హిల్మీ తన లేఖలో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాల్లో తెలంగాణను భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ నాయకత్వాన్ని, పాత్రనును కొనియాడారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక, సాంకేతిక కార్యక్రమాలను ఆయన నడిపించిన విధానం, అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఒక ఆదర్శంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. కేటీఆర్ సదస్సులో పాల్గొనడం వల్ల దక్షిణ ఆసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి పొందుతారని సమ్మిట్ కార్యదర్శి తెలిపారు. అలాగే, సాంకేతిక, ఆర్థిక వృద్ధిలో భారతదేశం – శ్రీలంక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి మంత్రులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ నాయకులు, ఆవిష్కర్తలు హాజరవుతారని, సుస్థిరమైన, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి సారిస్తారని వివరించారు.