KTR | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసినా సంస్థ ప్రయోజనాలే తమకు ప్రాణసమానమని భావించి నాటి ప్రభుత్వం తట్టెడు మట్టిని కూడా తవ్వనీయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు, రక్షణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ప్రత్యక్ష పోరాటాలు చేసిన సందర్భాలను ఆయన శనివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. సింగరేణి గనుల వేలంపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షలను అర్థం చేసుకొని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న పార్టీ తమదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా, వాటిని క్రూరంగా అణిచి, వేలమందిని చంపింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం యావత్ సమాజానికి తెలుసునని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎకిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరును ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
సింగరేణి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నిలబడటం వల్లనే.. వేలంలో గనులను దకించుకున్న రెండు కంపెనీలు మైనింగ్ ప్రారంభించలేదనే విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ గనులను కేటాయించినా కేవలం తమ ప్రభుత్వ కఠిన వైఖరి, నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని తెలిపారు. రేవంత్ పేరొన్న రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టాక్ల్లీ, జెన, బెల్లోర గనులను దకించుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో బొగ్గు గనుల అమ్మకానికి ఎన్నడూ సమర్థించలేదని, అందుకే తమ ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిసిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల హకులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు గుర్తించాలని అన్నారు. తాజాగా బీజేపీకి రేవంత్‌రెడ్డి సర్కారు అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలు తెలిసిపోతున్నాయని పేర్కొన్నారు. గనుల వేలంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమారను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.