హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నదని పేర్కొన్నారు. దీనిపై మొత్తం మంత్రులు తేలు కుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడటం లేదని, ఒకో మంత్రి ఒకో దేశం పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ సామ్ బయటపడగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార ఒకరిని మించి ఒకరు నటించారని, వారి మాటలు మోసాలు సామ్‌ను దాచి ఉంచలేవని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో సీములు మాయమై సాములు మాత్రమే మిగిలాయని దుయ్యబట్టారు. సింగరేణి సామ్ తెలంగాణ ప్రజల విశ్వాసానికి తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ పాలనలో లాభాల్లోకి తీసుకొచ్చామని, కార్మికులకు ఇచ్చిన 10 హామీల్లో తొమ్మిది అమలు చేశామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటున్నదని విమర్శించారు.
వాటాల కొట్లాటతోనే స్కామ్ బయటకు..
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే కొత్త నిబంధన తీసుకొచ్చి టెండర్లను కట్టడి చేసిందని కేటీఆర్ విమర్శించారు. గతంలో దేశంలో ఎకడున్న కాంట్రాక్టర్ అయినా ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా, ఇప్పుడు తప్పనిసరిగా సైట్‌కు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. దీనిద్వారా ఎవరు టెండర్ వేయాలి, ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కారణంగా మొదటి పెద్ద కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకే దకిందని, రూ.250 కోట్ల కాంట్రాక్ట్ అం దుకున్నారని ఆరోపించారు. గతంలో మైనస్‌లో పోయే టెండర్లు ఇప్పుడు వేల కోట్ల విలువైన డీల్స్‌గా మారాయని, ఒకో టెం డర్‌ను వాటాలు వేసుకుని పుట్నాలు, బఠానీల్లా పంచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే ఈ సామ్ బయటకొచ్చిందని తెలిపారు. ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్ వాటాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి మధ్య విభేదాలు బయటపడ్డాయని, ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు.
2.5 లక్షల కోట్ల అప్పుతో ఏమిచేసినవ్?
హామీలపై నిలదీస్తే కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ రూ.2.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర సంపద పెంచారని గుర్తుచేశారు. ‘కేసీఆర్ అప్పు చేసిండు.. 73 వేల కోట్లు రైతుబంధు వేసిండు. గతంలో ఎవరైనా రైతులకు పైసలు ఇచ్చారా? కేసీఆర్ అప్పు చేసిండు.. రైతుబీమా ప్రీమియం కట్టిండు. రూ.40 వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథతో ఇం టింటికీ నల్లా నీళ్లు అందించిండు. కొత్త జిల్లాలు చేసి, కలెక్టరేట్లు కట్టిండు. నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, 1,022 గు రుకుల స్కూళ్లు కట్టిండు. మీ జైపూర్‌లో విద్యుత్తు కేంద్రం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి పదేండ్లలో కేవలం రూ.2.8 లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణ రాష్ట్ర సంపద పెంచిం డు. మరి రెండేండ్లలో రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసి, ఏం చేశారు? రైతుబంధు ఇచ్చినవా? పింఛన్ పెంచినవా? తులం బంగారం ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అమలుచేసినవా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ మంత్రి అయ్యాక పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ, మరో మూడేండ్లు గడిచినా 400 మందికైనా ఉద్యోగాలు ఇవ్వలేరని కేటీఆర్ విమర్శించారు.
ఢిల్లీకి మూటలు మోయడానికే సరిపోయింది..
మన జుట్టు జాతీయ పార్టీలకు అప్పగిస్తే తెలంగాణ ఆగమైతదని గతంలోనే చెప్పినమని, ఇప్పడు అదే జరుగుతున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీకి మూటలు మోస్తూ.. తన పదవిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సరిపోతున్నదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి 62 సార్లు ఢిల్లీకి వెళ్లారని, అది తెలంగాణ ప్రజల కోసమా? లేక పదవులు కాపాడుకోవడానికి సంచులు మోసేందుకా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీ పార్టీలేనని, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకొకటి చెప్పులు మోసే పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకరు సంచులు మోయడానికి పోటీపడితే.. మరొకరు చెప్పులు మోయడానికి తహతహలాడుతారని ఘాటు వ్యాఖ్యలుచేశారు.
బీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టినా కేసీఆర్‌ను గెలిపిస్తున్నట్టుగా కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ఓటేస్తే మంచిర్యాల జిల్లా ఎత్తివేస్తారని, జిల్లా ఉండాలా, పోవాలా? మీరే తేల్చుకోవాలని కోరారు. రేవంత్ పాలనలో మున్సిపాలిటీల్లో దోమల మందు కొట్టే దిక్కు లేదని, వీధిలైట్లు మార్చే తాకతు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర కార్పొరేషన్ మా జీ చైర్మన్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, నాయకులు తుంగ బాలు, విజయారెడ్డి, సంపత్, రాజారమేశ్, మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు సామ్ బయటపడగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార ఒకరిని మించి ఒకరు నటించారు. వారి మాటలు మోసాలు సామ్‌ను దాచి ఉంచలేవు. మొత్తం మంత్రులు తేలు కుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడటం లేదు. ఒకో మంత్రి ఒకో దేశం పారిపోయారు.
– కేటీఆర్