KTR | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ (జీపీ) లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకున్నదని మండిపడ్డారు. జీపీ లే అవుట్లలో గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమంటే పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులను ప్రభుత్వం లాకోవటమేనని అనుమానం వ్యక్తం చేశారు. పరిపాలన అనుభవం లేకుండా తుగ్లక్‌ను తలపించేలా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చేసిన రేవంత్ ప్రభుత్వం తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో పేద, మధ్య తరగతివారిని టార్గెట్ చేసిందని మండిపడ్డారు. ఇండ్లు కూల్చింది చాలదన్నట్టు ఇప్పుడు పేదలు, మధ్యతరగతివర్గాల ప్లాట్లపై ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసే కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న జీపీ లే అవుట్లలో వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుకోవడమే ప్రజలు చేసిన తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అనేక ఏండ్లుగా ఆ ప్లాట్లు ఎంతో మంది చేతులు మారాయని, ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు, మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉన్న సమస్యలు పరిషరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టించటమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో వేలాదిగా జీపీల్లో లే అవుట్లు వెలిశాయని, అవి ఎంతో మంది చేతులు మారాయని వివరించారు. ఇప్పుడు వాటికి ఎవరిని బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తు కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం పైసాపైసా కూడబెట్టుకొని పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చెల్లవంటే వారి పరిస్థితి ఏమిటని నిలదీశారు. తమ తాతలు, తండ్రులు కొనుగోలు చేసిన ప్లాట్లు చెల్లవని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వారెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్డర్లను బెదిరిస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నదని, ఇప్పుడు వెంచర్ల యాజమానుల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్‌తో పేదలు, మధ్యతరగతి ప్రజలను రేవంత్‌రెడ్డి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ విషయంలో మా ట్లాడిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు నేరుగా ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులు చెల్లవని చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామంటూ నమ్మబలికి ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన వాళ్లను కూడా ఆగం చేసే పరిస్థితి తెచ్చారని నిప్పులు చెరిగారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పంచాయతీ లే అవుట్ల వెంచర్లలో రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
‘నిర్బంధాన్ని ఎదిరిద్దాం..ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిద్దాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలుపై ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్లుగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ వెనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, హకులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, పోరాడితే సస్పెన్షన్లు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘ఇది నియంతృత్వ రాజ్యం..నిర్బంధాన్ని నిర్మిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు. ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉన్నది. నిర్బంధాన్ని ఎదిరిస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణ కోసం పోరాడతాం’ అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన పథకాలను స్కాములని ప్రచారం చేయటం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటల దిగుబడిలోనే కాదు..పశు సంపదలోనూ పదేండ్లు పండుగేనని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కులవృత్తులకు కేసీఆర్ కొండంత అండగా నిలవటం వల్ల పశుసంపదలో రాష్ట్రం గణనీయ వృద్ధి సాధించిందని చెప్పారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపనలో భాగంగానే సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేసిన సందర్భాలను గుర్తుచేశారు. రాష్ట్ర డిమాండ్‌కు తగ్గ మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశారని, ఇతర రాష్ట్రాలనుంచి నిత్యం వచ్చే వందలాది లారీల దిగుబడికి కేసీఆర్ కళ్లెం వేశారని ఉదహరించారు. కేసీఆర్ ప్రతి ఆలోచన వెనక సుదీర్ఘ అధ్యయనం సాగిందని వివరించారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణ ఫలితంగానే పదేండ్లలో రెండువేల కోట్ల వృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించిన సందర్భాన్ని ఉదహరించారు. కేసీఆర్ అద్భుత సీములను సాములు అంటూ దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు కనీసం ఇప్పుడైనా వారి వైఖరి మార్చుకోవాలని హితవుపలికారు.