KTR | కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే సిరిసిల్లలో ఉన్న మహేందర్ రెడ్డి వరకు అందరూ దగుల్బాజీలు, సన్నాసులు, చేతకాని వెధవలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంటరీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నియోజకవర్గంలో మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు రద్దు చేయడం కాదు.. నీకు దమ్ముంటే, చేతనైతే ప్రజల మనసు గెలుచుకోవాలి. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు తాను రెండు లేన్ల రోడ్డు మంజూరు చేశాను. నీకు చేతనైతే ఆ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చి ప్రజల మనసును గెలుచుకోవాలి. తన మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంప పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేశారు. కేసీఆర్ మీద కోపంతో చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం వేస్ట్ అంటున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వొద్దు.. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో దివాళా, దగుల్బాజీ రాజకీయం చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసులకు, జైళ్లకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులను రద్దు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, నేతన్నలను ఆదుకున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు వేయలేదు. ఎల్ఆర్ఎస్పై రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలి. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. డిసెంబర్ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్ మాట తప్పారు. బీఆర్ఎస్ కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. కరీంనగర్‌కు బండి సంజయ్ చేసిందేమీ లేదు. మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప సంజయ్ చేసిందేమీ లేదు. అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో కదన భేరి బహిరంగ సభ నిర్వహిస్తాం అని కేటీఆర్ తెలిపారు.