KTR | భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై పచ్చి అబద్దాలాడుతున్న రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లి కాలేదంట.. సంసారం అయిపోయి పిల్లలు పుట్టిండ్రంటా అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలి. మీరు ఉదాసీనంగా ఉంటే మరిన్ని అబద్దాలాడుతూ, అసలు హామీలే ఇవ్వలేదని అంటారు. మొదటి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేషన్, పరీక్ష, ఇంటర్వ్యూ జరిగిన తర్వాత నియామకం పత్రం ఇవ్వాలి. మరి రేవంత్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు..? ఒక్కంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. పెళ్లి కాలేదంట.. సంపారం అయిపోయి.. పిల్లలు మాత్రం పుట్టిండ్రంటా.. ఎట్ల పుట్టిండ్రు అంటే సమాధానం లేదు. అంటే 30 వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బుకాయిస్తున్నాడు దబాయిస్తున్నాడు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చేశాను అంటున్నాడు. మరోసారి నిరుద్యోగులను పిచ్చొళ్లను చేయడానికి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.. నియామక పత్రాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి. ఈ సీఎంకు బద్ది చెప్పాలంటే, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో టెట్‌కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేసిండు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టిండు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.