KTR | రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ‘జై తెలంగాణ’ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి శుక్రవారం మేడిగడ్డ పర్యటనకు బయల్దేరిన కేటీఆర్ మార్గమధ్యలో దామెర మండలంలోని ఎన్ఎస్ఆర్ హోటల్లో బాధిత నాయకులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జై తెలంగాణ’ పదాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. జై తెలంగాణ నినాదాలు చేసినందుకు అక్రమ కేసులు బనాయించి, దేశద్రోహుల్లా రాత్రికిరాత్రే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు.
అగ్రంపహాడ్ జాతరలో బీఆర్ఎస్ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆత్మకూరు ఎస్సైపై వేటువేసినంత మాత్రాన సరిపోదని, మిగతా పోలీసు అధికారులపైనా పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ప్రతీ పోలీసు అధికారిపైనా పూర్తిస్థాయి విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని తెలిపారు. 14 ఏండ్లపాటు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తమకు నిర్బంధాలు కొత్తకాదని, ప్రతి గులాబీ సైనికుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రంపహాడ్ ఘటన పునరావృతం అయితే పార్టీ చూస్తూ ఊరుకోదని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.