హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసింది.. శ్వేతపత్రం కాదని, అబద్ధాలతో కూడిన తప్పుడు పత్రమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ అజెండాకు అనుగుణంగా ఆర్థిక అంశాలను చేర్చడానికి ప్రయత్నించిందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణను ఎంతో విజయవంతంమైన రాష్ట్రంగా తీర్చిదిద్దితే.. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఆ ప్రతిష్ఠను దిగజార్చాలనుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణ నష్టాల్లో ఉంటే కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎంసీహెచ్ఆర్డీలో కొత్త క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృథా చేస్తున్నారని, న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామన్న సర్కారు దానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని నిలదీశారు. 100 రోజులు కాకముందే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని కేటీఆర్ హెచ్చరించారు.