KT Rama Rao | రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): చావుకు తెగించి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడామని, కాంగ్రెస్ నాయకుల పిచ్చిపిచ్చి డైలాగులకు భయపడబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదని, గీ సుతిలీ బాంబులు, లక్ష్మీబాంబులు, తుస్సు బాంబులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఏదో అడ్డమైన కేసుపెట్టి జైలుకు పంపుతానంటే పంపుకోవచ్చని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతూ విలేకరులతో మాట్లాడారు. దీపావళిలోగా బాంబు పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాంబు అంటే ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ మీద ఏమన్నా చెబుతాడేమో? ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినయన్నది చెబుతాడో? బీజేపోళ్లను ఎట్ల ప్రసన్నం చేసుకుని సంధికుదుర్చుకున్నది, ఎట్ల బతిమిలాడి కేసు కాకుండా చూసుకున్నది, అదానీ కాళ్లు ఎట్ల పట్టుకొని కాపాడుకున్నడో చెబుతాడా? లేక అమృత్ స్కీంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్దికిచ్చిన రూ.1137కోట్ల కాంట్రాక్టుపై విచారణకు ఆదేశిస్తారన్న బాంబు పేలుస్తారా? అని ఎద్దేవా చేశారు.
దీపావళి కంటే ముందు పొంగులేటి బాంబే పేలేటట్టు ఉన్నదని చమత్కరించారు. ఇసొంటి కొత్త బిచ్చగాళ్లను చాలామందిని చూశామని, రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబుతోనే కొట్లాడామని, ఈ చిట్టినాయుడు తమకో లెక్కకాదని ఎద్దేవా చేశారు. ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ సవాల్ విసిరారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బాగోతం, ముఖ్యమంత్రి బామ్మర్ది బాగోతం, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు రాఘవ కన్స్ట్రక్షన్, మేఘా ఇంజినీరింగ్, రూ.4,500 కోట్లను ఎట్ల పంచుకున్నరో అన్నింటినీ బయట పెడతామని చెప్పారు. అడ్డం పొడువు కేసులు పెట్టి తమను ఇబ్బందులు పెట్టాలనుకుంటే అంతకన్నా ఎక్కువ కొట్లాడుతామని చెప్పారు. చావుకైనా తెగించి కొట్లాడుతం తప్ప పిచ్చిపిచ్చి మాటలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా?
బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేయలేదంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ఒక పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే, ఒకరికి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని చేసుకుంటే దానిని వ్యభిచారమే అంటారని ధ్వజమెత్తారు. జగిత్యాలలో కాంగ్రెసోళ్లను కాంగ్రెసోళ్లో చంపుకుంటున్నారని, పోలీసోళ్ల కుటుంబాలను పోలీసోళ్లే కొడుతున్నరంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్న విషయాన్ని జీవన్‌రెడ్డి తెలుసుకున్నారని, ఇన్ని రోజులకు కాంగ్రెసోళ్లకు కనువిప్పు కలిగిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా, కరెంటు చార్జీలు పెంచినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సీఎంకు బుర్రలేదు
పదేండ్ల తమ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు, ఆకలి చావులు లేకుండా పరిశ్రమలను నడిపించామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ, పది నెలల కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, చార్జీల మోతలంటూ మండిపడ్డారు. ఒక్క సిరిసిల్లలోనే పదిమంది, ఇతర జిల్లాలో ఎనిమిది మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాము ఆత్మహత్యలు లేని తెలంగాణ చేశామని, పది నెలల మీ పాలనలో ఆటో డ్రైవర్లు, రైతులు, నేతన్నలు ఇంతమంది చనిపోతున్నారని చెప్పారు. ఆ కుటుంబాలకు సహాయం చేయాలని కోరామని, నిర్ణయాలు మార్చుకోవాలని హితవు చెప్పినా బుర్రలేని సీఎం బుద్ధి మారట్లేదని ధ్వజమెత్తారు.
చార్జీల పెంపును తిరస్కరిస్తున్నాం
ఉచిత విద్యుత్తు పేరిట ఉన్న విద్యుత్తును పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. విద్యుత్తు చార్జీల మోతలతో పేద, మధ్య తరగతి ప్రజలపై రూ.18 వేల కోట్లు భారం మోపడమంత దరిద్రమైన ఆలోచన ఇంకోటి లేనేలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితి తీవ్రత ప్రభుత్వానికి తెలవాలన్న ఉద్దేశంతో గత అయిదు రోజులుగా వరుసగా హైదరాబాద్, వికారాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో ఈఆర్సీని కలుస్త్తూ ప్రజల తరఫున తమ వాదన వినిపిస్తున్నామని చెప్పారు. చార్జీల పెంపును నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్తే ప్రజల్ని ఐక్యం చేసి ప్రజా పోరాటం ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఉచిత విద్యుత్తు ఇచ్చినా పైసా పెంచలే
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చామని, నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు, మరమగ్గాల పరిశ్రమకు సబ్సిడీలు అందించి అండగా నిలిచామని కేటీఆర్ గుర్తు చేశారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పైసా పెంచలేదని స్పష్టం చేశారు. అదానీ, అంబానీ, సిరిసిల్ల నేతన్నలను ఒకే గాటన కడుతారా? అని ప్రశ్నించారు. విద్యుత్తు ఆధారిత మరమగ్గాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంతో పదిమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లలో ఆత్మహత్యలు లేకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను నడిపించామని, పదినెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క సిరిసిల్లలోనే పదిమంది కార్మికులు కార్మికులు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పది హెచ్‌పీల వరకు ఉన్న సిరిసిల్ల మరమగ్గాల విద్యుత్తు సబ్సిడీని 30 హెచ్పీలకు పెంచాలని ఈఆర్సీని కోరినట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనను లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి ఇవ్వాలని ఈఆర్సీని కోరారు. కేసీఆర్ తీసుకున్న విద్యుత్తు సంస్కరణలతో విద్యుత్తు సంస్థలకు స్వర్ణయుగంగా మారిందని వివరించారు. పాలకులకు విజన్ ఉంటే సంపద పెంచి పేదలకు పంచాలి కానీ, కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాలన్న ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్తుతో విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ఫిక్స్ చార్జీని రూ.10 నుంచి రూ. 50కి పెంచాలన్న నిర్ణయం వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు.
7 వేల మెగావాట్లను 24 వేలకు పెంచాం
డిస్కంల నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిని ఎలా అమలు చెయ్యాలో తెలియక అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. 7 వేల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి ఉంటే దాని సామర్థ్యాన్ని 24వేల మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
కేటీఆర్ మానవత్వం
కేటీఆర్ మరోమారు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించి, తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల శివారులో సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వాహనం ఆపారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెకు చెందిన వేల్పుల సంజీవ్, సిరిసిల్లకు చెందిన శామంతుల రమేశ్‌ను దవాఖానకు తరలించారు. కేటీఆర్ ఆగడంతో స్థానిక నేతలు చేరుకుని, బాధితులకు సాయం అందించారు. యువకులు బైక్‌పై సిరిసిల్లకు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన నేరేళ్లలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో సంజీవ్, రమేశ్, ఒమిని వాహనంలోని ఒక వ్యక్తి గాయపడ్డారు. రమేశ్, సంజీవ్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.
సంజయ్ ఒక రాజకీయ వ్యభిచారి. పార్టీ మారిన పదిమంది కూడా రాజకీయ వ్యభిచారులే.
పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి చెప్తుంటే ఫిరాయింపులు జరగలేదని శ్రీధర్‌బాబు బుకాయిస్తున్నడు. రేవంత్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి కాళ్లుమొక్కి కండువాలు కప్పుతున్నడు. స్పీకర్ కుయ్లేదు కయ్లేదు. హైకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపుతామని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి. ఫిరాయింపులు చేసినోళ్లనా? రాజకీయ వ్యభిచారం చేసేటోళ్లనా?
–కేటీఆర్
ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల పారిశ్రామికరంగంలో మందగమనం మొదలైంది. ఫాక్స్‌కాన్ లాంటి సంస్థ తన కంపెనీ విస్తరణను విరమించుకున్నది. ఇలాంటి పరిస్థితిలో పరిశ్రమలను కాపాడుకునేలా వీలైనంత వరకు ప్రోత్సాహకాలు అందించాలి. డిస్కంల ప్రతిపాదనల వెనక కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉంది.
-కేటీఆర్
ఒక్కటి మాత్రం చెబుతున్నా. వచ్చేది మన ప్రభుత్వమే. ఒక్కొక్కడు తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఎవరైతే బిల్డర్లను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారో వాళ్లకు మిత్తితో సహా తిరిగి ఇస్తాం.
-కేటీఆర్