రంగారెడ్డి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ హయాంలో 16లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి ఎకరాలకు పెంచారని ధ్వజమెత్తారు. ఈ జాబితాను అడ్డుపెట్టుకొని
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్ చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూములను లాక్కునేందుకు రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ దందా చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్‌సిటీ పేరుతో రేవంత్ భూదందా
ఫ్యూచర్‌సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూదందా చేస్తున్నారని, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులకు దోచిపెట్టేందుకే కొత్త కుట్రకు తెరతీస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల ఫార్మాసిటీ భూములను తిరిగి రైతన్నలకు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఓట్లేయించుకొని, ఇప్పుడు ఫోర్త్‌సిటీ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో ఉన్నదని ఓ వైపు చెబుతూనే, అవే భూముల్లో ఫోర్త్‌సిటీ కడుతామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆనాడు ఫార్మాసిటీ భూముల్లో అప్పటి సీఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార, మంత్రి సీతక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు పాదయాత్ర చేసి హామీ ఇచ్చి అవే భూములను పంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండున్నరేండ్ల తర్వాత అదనంగా మరో 16వేల ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడుతానని నాటకాలు ఆడుతున్నారంటూ నిప్పులుచెరిగారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక రేవంత్‌రెడ్డిని చూసి కుక్క కూడా పక్కకు జరుగదంటూ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి తన అధికారం, పదవిని చూసుకొని అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలు చేసినా ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండానే ఎగిరిందన్న విషయం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఫ్యూచర్ లేని రేవంత్.. ఫ్యూచర్‌సిటీ కడ్తడా?
ఫ్యూచర్ లేని రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ కడుతానని ప్రజలను మభ్యపెడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఏఐ చిత్రాలతో గ్రాఫిక్స్ చేసి ఫ్యూచర్‌సిటీ అని రేవంత్‌రెడ్డి కొత్త కుట్రకు తెరతీశాడు. రేవంత్‌రెడ్డికి ఉన్న సిటీనే పట్టించుకొనే తెలివి లేదు. దోమలు కుట్టి జనం చస్తుంటే సోయి లేదు. అలాంటిది ఫ్యూచర్‌సిటీ కడుతా అని మాట్లాడుతున్నడు. ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడుతా అంటే జనం నవ్వుతున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోహెడలో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో అతిపెద్ద పండ్ల మారెట్ కట్టాలని భావించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ భూముల విలువ పెరిగింది. ఇప్పుడు రాచకొండ గుట్టలకో, రామోజీ ఫిలింసిటీ అవతలకో పోవాలని చెప్తున్నరు. ఆ 178 ఎకరాలను అమ్ముకొనేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నా’రని కేటీఆర్ ఆరోపించారు.
నేడు మంచిర్యాలకు కేటీఆర్
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లాకు రానున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నస్పూరులోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం క్యాతన్‌పల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించనున్నారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి క్యాతనపల్లిలోని బాల్క సుమన్ ఇంటికి చేరుకుంటారు. పలు సంఘాల నాయకులతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.