హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో ఇంత నిర్బంధమెందుకు? కొడంగల్ ఏమైనా పాకిస్థాన్ బార్డర్లో ఉన్నదా? లగచర్ల చైనా సరిహద్దుల్లో ఉన్న కల్లోలితా ప్రాంతమా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘లగచర్లలో అర్ధరాత్రి గిరిజన బిడ్డలపై దమనకాండే కాదు..నిజనిర్ధారణ కోసం పట్టపగలు అక్కడికి వెళ్లిన మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకొని దౌర్జన్యం చేయడం అమానుషం’ అని మంగళవారం ఎక్స్ వేదికగా ఖండించారు. వాస్తవాలు తొక్కిపెట్టేందుకు ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తున్నదని నిలదీశారు.
పదేండ్లలో ఎన్నడూలేనివిధంగా కొడంగల్ ఏరియాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, అక్కడికి వెళ్లే దారుల్లో పోలీసు పహారా ఏర్పాటుచేసి మూసేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘ రేవంత్‌రెడ్డీ.. మీరెంత దాచే ప్రయత్నం చేసిన నిజం దాగదు.. లగచర్లలో మీ సర్కారు కిరాతకం ఇప్పటికే ఢిల్లీకి చేరింది. దేశరాజధానిలో మీ అరాచక పర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతున్నది’ అంటూ దుయ్యబట్టారు. నిజనిర్ధారణ కమిటీలను అడ్డుకోవడమంటే తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టేనని పేర్కొన్నారు. అడ్డుకున్నందుకు మహిళా సంఘాలకు క్షమాపణ చెప్పి, లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తేసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.