KTR | నర్సంపేట నియోజకవర్గం 16 చింతలతాండ గ్రామంలో వారం రోజుల కిందట ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. చనిపోయిన దంపతుల పిల్లలిద్దరిని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డితో కలిసి మంగళవారం కేటీఆర్ కలిశారు. పిల్లలద్దరినీ చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పిల్లలిద్దరీ చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు. పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోవడమే కాదు.. దాడికి గురైన పిల్లలు దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.