KTR | సూర్యాపేట : బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. 2001లో గులాబీ జెండా ఎగురవేసి ఒక్కడిగా బయల్దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీ కోసం రక్తం ధారపోస్తున్న అన్నదమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక వందనాలు. ఇది అరుదైన సందర్భం. తెలుగు రాజకీయాలు.. తెలంగాణ, ఏపీ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైనది. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగువారిని మద్రాసీలు అని పిలిచేవారు. కానీ నందమూరి తారకరామారావు టీడీపీ స్థాపించి తెలుగువారి గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేక అస్తిత్ ఉందని, పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్. ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసుకున్నానంటే ప్రత్యేక సందర్భం ఉంది. రెండే రెండు పార్టీలు విజయవంతంగా 25 ఏండ్ల పైచిలుకు ప్రస్థానాన్ని కొనసాగించాయి. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ గులాబీ పార్టీ అని కేటీఆర్ తెలిపారు.
ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2001లో ఆనాడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది..? ఆయనకు 46 ఏండ్ల వయసు. ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే దుస్సాహాసం ఉండాలి. నాడు వదేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఒక వైపు ఉన్నారు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్‌గా ఉంటూ ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ.. ఢిల్లీలో చక్రం తిప్పుతూ చంద్రబాబు ఒక వైపు ఉన్నాడు. అదే మాదిరిగా తెలంగాణ అంశం 30 ఏండ్లు మరుగునపడ్డ అంశం. 1971లో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ 11 ఎంపీలు గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కలిపోయింది. తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో తెలంగాణ సమాజనికి నమ్మకం లేని పరిస్థితిలో 2001లో గులాబీ జెండా ఎగురేసి.. ఒక్కడిగా బయల్దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.