ఖైరతాబాద్, మార్చి 12: ‘ఫిర్ ఆయేంగే.. సబ్కో తోఫా దియేంగే’ (మరోసారి అధికారంలోకి వస్తాం.. తప్పకుండా రంజాన్ తోఫా ఇస్తాం) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముస్లింలకు భరోసానిచ్చారు. తమ సర్కార్ హయాంలో ఏటా పేద ముస్లింలందరికీ రంజాన్ తోఫా ఇచ్చామని, బతుకమ్మ పండుగకు చీరలు, క్రిస్మస్ పర్వదినాన బహుమతులు అందించామని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్సీ, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సలీం ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని జ యగార్డెన్స్లో రంజాన్ కిట్ల పంపిణీ చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ పేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వలేదని, ఈ ఏడాది మాత్రం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసిందని, అది కూడా పరిమిత సంఖ్యలో ముస్లింలకు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసిందని వివరించారు. తాము అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్రంలోని పేద ముస్లింలందరికీ రంజాన్ తోఫా అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఆడపిల్లలకు పెండ్లి జరిగితే గత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంతో రూ.1,16,000 అందించే వారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆ నగదుతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నదని, ఇప్పటివరకు ఒక్క బంగారం ముక్క కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా నిద్రించే పరిస్థితి లేదని, ఏ క్షణంలో బుల్డోజర్ వచ్చి ఇండ్లు కూలగొడుతాయో, హైడ్రా ఎప్పుడు వస్తుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ను చూసి అన్ని వర్గాల ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసిన లైసెన్స్డ్ సర్వేయర్లు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,000 మందికిపైగా నియమించిన సర్కార్.. నెలల తరబడి పని ఇవ్వకుండా, జీతభత్యాలపై ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన సర్కార్.. అందుకోసం ఎంపిక చేసిన సర్వేయర్లకు మాత్రం అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
కర్ణాటక రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రతినెలా గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేశారని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సరార్ అన్యాయం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలతోపాటు ఇతర అంశాలపై కేటీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు లైసెన్స్డ్ పత్రాలిచ్చి నెలలు గడుస్తున్నా.. జీతభత్యాల గురించి పట్టించుకోకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేశారని సర్వేయర్లు దుయ్యబట్టారు.
ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భూసర్వే పనులు నిర్వహించే తమకు స్థిరమైన వేతనం లేకపోవడం వల్ల ఆర్థికంగా చితికి పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమను రోజూ ఎమ్మార్వో కార్యాలయాలకు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోపెడుతున్నారే తప్ప ఒక పని కూడా అప్పగించలేదని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు వర్ అలాట్మెంట్ విషయంలో స్పష్టమైన విధానం లేదని తెలిపారు. ప్రతి లైసెన్స్డ్ సర్వేయర్కూ సమానంగా, పారదర్శకంగా పనులను కేటాయించేలా ఒక సమగ్రమైన విధానాన్ని తేవాలని కోరారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి పంచన చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో సైతం పోటీ చేశారని, ఇప్పుడేమో తాను ఎక్కడికీ పోలేదంటూ మభ్యపెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మళ్లీ అబద్ధాలు ఆడుతూ మభ్యపెట్టేందుకు వస్తారని, ఆయన మాటలను నమ్మవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేటర్, మహేశ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే అహ్మద్, మధుకర్ యాదవ్, రజనీకాంత్, బాబు, రామ్‌నాథ్, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు భౌతికకాయానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నివాళులర్పించారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి కావూరి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కావురి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కావూరి సాంబశివరావుతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్యంగా 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడిన కాలాన్ని గుర్తుచేశారు.
కావూరి సిద్ధాంతపరంగా గట్టి సమైక్యవాది అయినప్పటికీ, తన నియోజకవర్గమైన సిరిసిల్ల పట్ల ఆయన చూపిన చొరవను కేటీఆర్ కొనియాడారు. ఉద్యమకాలంలో కూడా కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు సిరిసిల్లలో పర్యటించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్మికులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని గుర్తుచేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కావూరి పట్ల తనకు మంచి గౌరవం ఉండేదని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాగంటి సునీతాగోపీనాథ్ తదితరులు ఉన్నారు.
‘అది సికింద్రాబాద్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ. రవి అనే వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసి 8 రోజులు గడిచింది. ఆలస్యానికి కారణాలు తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే ఏజెన్సీ ఫోన్‌నంబర్ పనిచేయడం లేదు. నేరుగా కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే స్టాక్ లేదని, మరింత సమయం పడుతుందని వాదించారు. దీంతో రెండు రోజులు ఆగినా ఫలితం దక్కలేదు. దీంతో రవి అదే ఏజెన్సీలోని ఓ వ్యక్తిని కలిసి గ్యాస్ సిలిండర్ అర్జెంట్ అని చెప్పడంతో అసలు దందాకు తెరలేపాడు. రూ.2 వేలు ఇస్తే ఇదేరోజు గ్యాస్ పంపిస్తామని తెగేసి చెప్పాడు. అవాక్కైనా ఆ తర్వాత తేరుకున్న సదరు వినియోగదారుడు రూ.2 వేలు చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందాడు’.