KTR | హైదరాబాద్ : కుక్క తోక వంకర అన్న విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీటులో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
17 నెలల కాలంలో 44వ సారి ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. ఎందుకు ఢిల్లీకి పోతున్నాడో ఇప్పుడు అర్థమైంది. చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకొని జైల్లో వేయొద్దని అడుగుతుండు. బయటకు వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొడుతున్నాడు. ఒక్క ఇటుక పేర్చకుండా, కొత్త ప్రాజెక్టు కట్టకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా రూ. లక్షా 80 వేల కోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైతుందని అనుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఢిల్లీ బాసులు.. రాహుల్ గాంధేమో అఫిషియల్ బాస్.. మోదీ అన్ అఫిసియల్ బాస్.. డబ్బులతో వీరిద్దరిని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 17 నెలల కాలంలో రేవంత్ రెడ్డి కేవలం మూడు పనులు చేశారు. ఒకటి బీఆర్ఎస్పై నిందలు, రెండోది బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, మూడోది ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చందాలు.. ఇది నిజంగా సిగ్గు చేటు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయి ఎమ్మెల్యేగా అభాసుపాలైన రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చిందనుకున్నాం.. కానీ కుక్క తోక వంకర అన్నట్టు అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ పరువు జాతీయ స్థాయిలో తీస్తున్నందుకు ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాహుల్ అన్ని విషయాలు మాట్లాడుతారు.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ గురించి. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎంను చార్జిషీటులో చేర్చితే రాహుల్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. స్పందించాలి కదా..? రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో ఇప్పుడు అర్థమైంది. జపాన్ పర్యటన అని తప్పించుకుపోయినప్పుడే ఈ వ్యవహారం అర్థమైంది. ఈడీ చార్జిషీటులో ఏ1, ఏ2గా సోనియా, రాహుల్ పేరు పెట్టారు. దేశంలో ఉన్న నాయకులు స్పందించారు. కానీ రేవంత్ స్పందించలేదు. ఈ కేసులో తన పేరు ఉంటుందని రేవంత్‌కు తెలుసు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు, బీజేపీతో ఒప్పందం చేసుకునేందుకు మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ తరపున అడుగుతున్నాం.. రేవంత్ రెడ్డి తప్పుకోవాలి.. కాంగ్రెస్ పార్టీకి నైతికత ఉంటే వెంటనే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
కర్ణాటకలో హౌసింగ్ స్కీంలో ఆరోపణలు వస్తే నాటి సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. చాలా కేసుల్లో చాలా మంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ తెల్లారి లేస్తే రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారు.. సంవిధాన్ కో బచావ్ అంటారు.. మరి ఎందుకు స్పందించడం లేదు. కాంగ్రెస్ గురించి ఎన్నోసార్లు చెప్పాం.. కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉందని. ఈ కుంభకోణంపై దేశమంతా మాట్లాడుతున్నారు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను తొలగించాలని కర్ణాటక బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ నేతలు నోరు విప్పడం లేదు. తెలంగాణలో అపురూపమైన సంబంధాలు కాంగ్రెస్, బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించాలి. బీజేపీ ఎంపీల భూదందాలకు సీఎం రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.