KTR | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెప్తున్నదని, మరో వైపు పత్రికల్లో డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నారని రోజూ వార్తలు వస్తున్నాయని సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే డెంగ్యూ కారణంగా ఐదుగురు చనిపోయారని వార్తలు వచ్చాయని తెలిపారు. ఆదివారం కూడా మరో ముగ్గురు చనిపోయినట్టు వార్తలు చూశానని, మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతున్నదని ప్రశ్నించారు. దవాఖానల్లో సరిపడా మందులు కూడా లేవని పేర్కొన్నారు. ఒకే బెడ్ పై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు.
పిల్లలకు కుళ్లినా గుడ్డా…?
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కుళ్లిన గుడ్లను అందించడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శరత్‌రెడ్డి అనే ఎక్స్ యూజర్ సోమవారం కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ భువనగిరిలోని పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లు అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఇది చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు.