KTR | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. పదేండ్లలో 8 వేలకు పైగా అనుమతులు, రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీంతో లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు.
లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు. ఈ సదస్సులో వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ తన ప్రధానోపనాస్యంలో వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో టాప్ 5 మల్టీనేషనల్ కంపెనీల అతిపెద్ద క్యాంపస్‌లు నెలకొల్పాయి. టీఎస్ ఐపాస్‌తో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టాం. కేసీఆర్ తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్‌తో పెట్టుబడులను భారీగా ఆకర్షించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విప్లవాత్మక విధానం లేదు. పదేండ్లలో 8 వేలకు పైగా అనుమతులు, రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ మా విధానం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించామని కేటీఆర్ గుర్తు చేశారు.