Osamu Suzuki | ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corp) మాజీ చైర్మన్ ఒసాము సుజుకి(Osamu Suzuki) మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒసాము మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు.
కొన్నేండ్ల క్రితం హమమత్సులో ఒసాము సుజుకీని కలుసుకునే, ఆయనతో ముచ్చటించే అదృష్టం దక్కిందని చెప్పారు. ఒసాము చెప్పిన మాటలు, ఆయన వినమ్రత ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతాయని తెలిపారు.
గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒసాము సుజుకి తుది శ్వాస విడిచినట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ కంపెనీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. లింఫోమా (lymphoma) బ్లడ్ క్యాన్సర్‌తో మరణించినట్లు తెలిపింది.
1930 జనవరి 30న జపాన్‌లోని గెరోలో ఒసాము జన్మించారు. 1958లో షోహో సుజుకీని ఆయన వివాహం చేసుకున్నారు. సుజుకీ కుటుంబానికి వారసులు లేకపోవడంతో వివాహం అనంతరం ఆ కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆ కంపెనీకి చెందిన బైక్‌లు, కార్లను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు. దాదాపు 40 సంవత్సరాలకు పైగా సుజుకి మోటార్ కార్ప్‌కు నాయకత్వం వహించారు. 2021 సంవత్సరంలో ఆయన పదవీ విరమణ ప్రకటించారు. డిసెంబర్ 25న ఆయన క్యాన్సర్‌తో మరణించినట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది.