KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను కేటీఆర్ బట్టబయలు చేశారు. ఈ ఉద్యోగాలకు రేవంత్ కేవలం నియామక పత్రాలు మాత్రమే అందజేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. 32,517 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆరేనని కేటీఆర్ తేల్చిచెప్పారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి, మంత్రులు ఊదరగొడుతున్నారు. మీరు 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఏ తేదీన నోటిఫికేసన్ ఇచ్చారు. రాతపరీక్ష ఎప్పుడు నిర్వహించారు. ఫలితాలు ఎప్పుడు ఇచ్చారో తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. కానీ వారు చెప్పరు. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు అబద్దాలు చెబుతున్నారు. 32 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
గురుకులాల్లో 9,210 టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 2023లో రాతపరీక్షలు నిర్వహించారు. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 2024లో విడుదలయ్యాయి. ఈ పోస్టుల భర్తీని కూడా తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరు తనానికి నిదర్శనం అని చెప్పొచ్చు.
పోలీసు శాఖలో 17,516 ఉద్యోగాలకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చాం. జూన్ 2023లో రాతపరీక్షలు నిర్వహించాం. అక్టోబర్ 4, 2023లో ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. పోలీసు ఉద్యోగాల భర్తీ కేసీఆర్ హయాంలోనే జరిగింది. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.
5,204 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 2, 2023న రాతపరీక్ష నిర్వహించాం. డిసెంబర్ 23, 2023న ఫలితాలు ప్రకటించాం. ఇవి కూడా తానే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు.
587 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 2023లో రాతపరీక్ష నిర్వహించి, ఆగస్టు 7 2023లో ఫలితాలు ప్రకటించాం. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయాం. పైన పేర్కొన్న ఉద్యోగాలకు రేవంత్ కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది మాత్రం కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 1.60 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయగా, 32 వేల ఉద్యోగాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. ఇవి అవి మొత్తం కలుపుకుంటే కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక లక్షా 92 వేల పైచిలుకు ఉద్యోగాలు అని కేటీఆర్ తెలిపారు.