KTR | హైదరాబాద్, అక్టోబర్ 25 : రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. మోసాన్ని మోసంతోనే జయించాలని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట మహేష్‌తో పాటు ఆయన అనుచరులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయి. ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది. వృద్ధులు, రైతులు, మహిళలు అందరిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం మోసపోయాం.. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు. అందుకే మేం కూడా జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తామని గ్రామల నుంచి రైతులు, ప్రజలు చెబుతున్నారని అన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలి. ప్రజల నిజమైన అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తేవాలి. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు. జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే నెల 11న జరిగే పోలింగ్‌లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. “మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని కాపాడుకుందాం” అని ఆయన పిలుపునిచ్చారు.