హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : పెట్టుబడుల్లో తెలంగాణ ఎక్కడున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో టాప్ 10లో ఉన్న రాష్ర్టాల పెట్టుబడుల జాబితాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి, ద్వితీయ త్రైమాసికాల జాబితాను విడుదల చేసింది. ఆయా రాష్ర్టాలకు వచ్చిన ప్రాజెక్టులు, వాటి ద్వారా ఆయా రాష్ర్టాలకు ఎన్నివేల కోట్ల పెట్టుబడులు, జాతీయస్థాయిలో ఆ రాష్ట్ర పెట్టుబడుల వాటా ఎంత? అనే వివరాలను ఆ సంస్థ పోస్ట్ చేసింది.
ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా సంస్థ విడుదల చేసిన జాబితాను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ పెట్టుబడుల్లో దూసుకుపోతున్న రాష్ర్టాలను అభినందించారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ర్టాలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ పెట్టుబడుల్లో వారు (ఇండియన్ టెక్ ఇన్ఫ్రా) స్వచ్ఛబయో, అదానీ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోలేదా? అని ఎద్దేవా చేశారు. ప్రెష్ ప్రాజెక్ట్స్ టాప్ 10 పేరుతో మొదటి, ద్వితీయ త్రైమాసికాలకు సంబంధించి సదరు సంస్థ విడుదల చేసిన రాష్ర్టాలు, ప్రాజెక్టులు, వాటి ద్వారా వచ్చిన పెట్టుబడులు తదితర వివరాలిలా ఉన్నాయి.