వెంగళరావునగర్/హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ‘చట్టం బండికి చుట్టమా.. కేంద్ర మంత్రి కొడుకు ఓ ఆడబిడ్డపై లైంగికదాడికి పాల్పడితే శిక్షించరా? అధికార అహంకార మదంతో బాధితులపైనే బండి తప్పుడు కేసులు బనాయిస్తారా’ అంటూ బీఆర్ఎస్కు చెందిన మహిళా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ మధురానగర్‌లోని బాలల హకుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు తుల ఉమ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాగంటి సునీత, అడ్వకేట్ లలితారెడ్డి తదితరులు చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో ఉ న్నారు. ఈ సందర్భంగా తుల ఉమ మాట్లాడు తూ.. తన బిడ్డకు న్యాయం జరగాలని ఓ తల్లి కేసుపెడితే.. ఆ కేసును పకదారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టే.. తక్షణమే నిందితుడైన భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నేరం చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. ఈ కేసులో తాము సమర్పించిన ఆధారాలతో ఏకీభవించి సుమోటోగా తీసుకుంటున్నట్టు చైర్మన్ తెలిపారని వెల్లడించారు. నేరస్తుడికి శిక్ష పడేటట్టు చూస్తామని స్పష్టంచేశారని తెలిపారు.
మైనర్‌ను లైంగికంగా వేధించిన కేసులో తప్పించుకొని తిరుగుతున్న తన కొడుకు సాయి భగీరథ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు అప్పగించాలని తుల ఉమ డిమాండ్ చేశారు. ధర్మం గురించి గొప్పలు చెప్పే సంజయ్.. కొడుకు విషయంలో ఎందుకు ధర్మం తప్పుతున్నాడని నిలదీశారు. నేరం చేసిన వాడిని కాపాడిన వారు నేరస్తులే కాబట్టి మొదటి ముద్దాయి బండి సంజయేనని, అతడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి సంజయ్ రాజీనామా చేయాలని అన్నారు. బండి సంజయ్ కొడుకని స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కరీంనగర్లో బాధిత బాలిక మీదనే పోలీసులు ఎక్స్టార్షన్ (బలవంతంగా డబ్బు గుంజడం) కేస్ పెట్టడం దారుణమని అన్నారు. ఈ విషయంలో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్లు ఇష్యూ చేస్తామని కమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు. వారితోపాటు పేట్ బషీరాబాద్ పోలీసులకు కూడా సమన్లు జారీచేశార ని, అరెస్టు ఎందుకు ఆలస్యం అవుతున్నదని ప్రశ్నించారు. పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాల్సి ఉండ గా.. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సెక్షన్ 7, 8 పెట్టకుండా.. కేసును నీరుగార్చేందుకు సెక్షన్స్ 11, 12 పెట్టారని, దానిపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరినట్టు తెలిపారు.