దుబ్బాక,డిసెంబర్16: ఉద్యమాల గడ్డ దుబ్బాక నియోజకవర్గం గులాబీ కంచుకోట అని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా దుబ్బాక ప్రజలు మాత్రం కేసీఆర్‌కే జై కొడుతున్నారని స్పష్టంచేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో ప్రత్యేకత చాటుకున్నదని చెప్పారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ ఆత్మీయ సన్మాన, భరోసా కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో 145 పంచాయతీలకు 88 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై అభిమానంతోనే పంచాయతీ ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించినట్టు తెలిపారు.