KTR | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ) : ‘తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్దే అధికారం.. చరిత్రాత్మక వరంగల్ సభకు లక్షలాదిగా పోటెత్తిన జనమే ఇందుకు నిదర్శనం.. ఇదే ప్రజలిచ్చిన రజతోత్సవ సందేశం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలు, దిగ్విజయంగా నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సోమవారం ఒక ప్రకటనలో కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశ రాజకీయాల్లో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా రజోత్సవ వేడుక నిలిచిపోనున్నదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాబలాన్ని చాటడం గర్వకారణమన్నారు. ఈ సభ స్ఫూర్తితో భవిష్యత్‌లో రేవంత్ సర్కారు అరాచకాలను అడుగడుగునా ఎండగడతామని స్పష్టం చేశారు.
సమావేశానికి హాజరైన లక్షలాది మంది కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విని అచంచలమైన విశ్వాసాన్ని చూపారని కొనియాడారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులు విఫలమైనప్పటికీ, అనేక ఆటంకాలు కల్పించినప్పటికీ లక్షల మంది సమయానికి ముందే ప్రాంగణానికి చేరుకోవడం వారి నిబద్ధతను తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సభ ఆరంభం మాత్రమేనని అన్నారు. ‘కేసీఆర్ నేనే ముందుండి పోరాడతానని ప్రకటించారని, ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద వెంటాడుతామని ప్రతినబూనారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్కారు వైఫల్యాలు, దోపిడీని మీడియా ద్వారా ఎండగట్టాలని ఉద్బోధించారు.
కేటీఆర్ సోమవారం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు కృషిచేసిన వారికి, ముఖ్యంగా వరంగల్ జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. నెలరోజులుగా నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా శ్రమించడంతోనే సభ జయప్రదమైందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రసంగాన్ని, సభలోని జన స్పందనను ప్రపంచానికి వినిపించిన మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు చెప్పారు.
జిమ్‌లో కసరత్తు చేస్తూ కేటీఆర్ సోమవారం గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో స్వల్పంగా గాయమైందని తెలిపారు. డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వెల్లడించారు. త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, ఆయన త్వరగా కోలుకొని యథావిధిగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో వేలమంది నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సాధ్యమైనంత తొందరలో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు.