నన్ను కడుపులో పెట్టుకొని గజ్వేల్ నియోజకవర్గ ఓటర్లు రెండుసార్లు గెలిపించారు. లక్ష్యంగా పెట్టుకొని కొన్ని పనులు పూర్తిచేసుకున్నాం. రైలు వచ్చింది. యూనివర్సిటీలు పెట్టుకున్నం. చేయాల్సినవి చాలా ఉన్నయ్. ఈ అభివృద్ధి ఇంతటితో ఆగొద్దు. నియోజకవర్గంలో ఇండ్లు లేనివారంటూ ఉండొద్దు. మండలాల్లో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత కాంప్లెక్స్‌లను నిర్మించుకోవాలె. తూప్రాన్‌లో డిగ్రీ కాలేజీ పెట్టుకుందాం.
– కే చంద్రశేఖర్‌రావు
CM KCR | మేడ్చల్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికే తలమానికంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో శుక్రవారం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తనను కడుపులో పెట్టుకొని గజ్వేల్ నియోజకవర్గ ఓటర్లు రెండుసార్లు గెలిపించారని, ఇప్పటివరకూ కొన్ని పనులు పూర్తిచేసుకున్నామని వెల్లడించారు.
రైలు వచ్చిందని, యూనివర్సిటీలు పెట్టుకున్నామని తెలిపారు. వాస్తవానికి ఈ టర్మ్‌లోనే గజ్వేల్‌లో ఇండ్లులేని వారు ఉండొద్దనేది తన కల అని, కానీ కరోనా, పెద్ద నోట్లరద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రెండు పెద్ద దెబ్బలు తగిలాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ఇక్కడికే అన్ని గ్రామాల వారిని పిలిపించుకొని ఒక్క రోజంతా వారికోసమే కేటాయిస్తానని, అప్పుడు అన్ని సమస్యలపై మాట్లాడుకొని, పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. ఈ టర్మ్‌లో నెలకు ఒక పూట కచ్చితంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానని, అందరం కలిపి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అన్ని మండలాల్లో ప్రజలకు అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండేలా సమీకృత కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని తూప్రాన్ పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గజ్వేల్ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు భూములు ఇచ్చిన రైతుల త్యాగం గొప్పది. భూములు పోయినవాళ్ల బాధ నాకు తెలుసు. నా రెండెకరాల భూమి, నా అత్తగారి భూమి కూడా మునిగిపోయింది. కానీ.. 65 టీఎంసీల మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు ఇప్పుడు నాలుగు పాత జిల్లాలకు అన్నం పెడుతున్నాయి. భూమి కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా.
-సీఎం కేసీఆర్
ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకొంటే చిత్తశుద్ధితో పథకాలను అమలు చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథలాంటివి విజయవంతం కావాలంటే ఆ పథకంలో జీవించాలని అన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎలా చేశారో.. అదేరీతిన రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం వల్లనే అది విజయవంతమైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ట్యాంకుల లెవల్స్ తీయించి, వాటి కన్నా ఎక్కువ ఎత్తులో నుంచి నీళ్లు తీసుకురావడం వల్ల తక్కువ కరెంటు వినియోగంతో ఎక్కువ శాతం గ్రావిటీపైనే నీటి సరఫరా జరుగుతున్నదని చెప్పారు. దీంతోపాటు నీళ్లు ఎదురెక్కకుండా ఉండటం వల్ల పైపులైన్ వ్యవస్థ సుదీర్ఘకాలం మన్నికగా ఉంటుందని తెలిపారు. ఈ పథకంతో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా బిందెల ప్రదర్శన లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోతుంటే, తెలంగాణలో ఆరున్నర మీటర్లపైకి భూగర్భ జలాలు ఉబికి వచ్చాయని తెలిపారు.
ఎండాకాలంలో సైతం చెరువులు, చెక్‌డ్యాంలు నిండుకుండుల్లా ఉండి, వానకాలాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. అటవీ సంపదను వృద్ధి చేయడంతోపాటు చెక్‌డ్యాంలు, ప్రాజెక్టులను నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. వ్యవసాయం అభివృద్ధి చెందడంతో గ్రామాలు పునరుజ్జీవం పొందాయని వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుబంధులాంటి పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయం బాగుంటే అందరికీ పని దొరుకుతుందని, తద్వారా గ్రామాలు బాగుపడ్తాయని అన్నారు. వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలనేది తన సంకల్పమని చెప్పారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 20-30 కార్లు వచ్చాయని, ఏసీలు కూడా వచ్చాయంటే గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని అన్నారు. పదవులు వస్తాయి.. పోతాయని, కానీ పదవి ఉన్నప్పుడు ఏమి చేశామన్నదే ముఖ్యమని తెలిపారు. ఇతర పార్టీల నాయకులు ఎంతో మాట్లాడుతారని, అధికారంలో ఉన్నప్పుడు వారు ఎందుకు ఏమి చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు దీన్ని గమనించి, సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రాజకీయ నాయకులు ఎప్పుడూ రిలాక్స్ కావొద్దు. ఇంకేం కావాలో ఆలోచించాలి తప్ప.. అయినదాంతోటి సంతృప్తి పడి సంబురాలు చేసుకోవద్దు. భవిష్యత్తును ఇంకా మార్గదర్శనం చేసుకోవాలి. ఇంకేం చేయాలో ఆలోచించాలి.
-సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకులు ఎంతో దయనీయంగా ఉండేవని కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. తెలంగాణ అంటే లెక్కగానీ, లక్ష్యంగానీ, వాయిస్గానీ, సరైన నాయకుడుగానీ లేని పరిస్థితి అని గుర్తుచేసుకొన్నారు. ఎన్టీఆర్ టీడీపీ టికెట్లు ఇస్తున్నపుడు నాచారం స్టూడియోకు పోతే అక్కడ ఉన్న తెలంగాణ నాయకులు గుడి మెట్ల దగ్గర బిచ్చగాళ్ల లెక్క కూర్చుండటం చూసి తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు. తెలంగాణ కోసం కొట్లాడదామంటే.. మన ఉద్యోగాలు పోతయని, తెలంగాణ రానీయరు అని ఎమ్మెల్యేలందరూ నిరాశతో అన్నారని గుర్తు చేసుకొన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.80 లక్షలు పైరవీకారుల దగ్గర ఉన్నట్టు తేలిందని అన్నారు. ఓ అధికారిని పిలిచి అడిగితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యేనో, అధికారితోనో అయ్యే పని కాదని, ముఖ్యమంత్రి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ హయాంలో ఆయన్ని ఒప్పించి 18 స్లాబ్ రేటు తెచ్చింది తానేనని తెలిపారు. చంద్రబాబు హయాంలోనూ విద్యుత్తు బిల్లులు రూ.85 పెంచేందుకు క్యాబినెట్లో చర్చిస్తే.. ‘తెలంగాణలో మేం బతకాల్నా? పోవాల్నా?’ అని గొడవ పెట్టుకొంటే చివరకు రూ.35 పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు గజ్వేల్ సభలోనే ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 1999లో ఎవరితోనూ మాట్లాడకుండా చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచితే కోపం వచ్చి.. ఎవరు వచ్చినా, రాకున్నా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పోతానని చెప్పి బయలుదేరానని తెలిపారు. చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలని తాను డిమాండ్ చేసినా చంద్రబాబు వినలేదని, పైగా బషీర్‌బాగ్ వద్ద రైతులపై కాల్పులు జరిపారని గుర్తు చేశారు. తదనంతరం తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని వివరించారు. అనేక అవరోధాలు అధిగమించి, పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకొన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌లో గెలవడం గొప్ప కాదు.. పక్కన ఉన్న రెండు, మూడు నియోజకవర్గాలు కూడా అర్సుకోవాలి. తెలంగాణ అభివృద్ధి ఆగొద్దు. ఇయ్యాల ఓ దారికి వచ్చాం. ఇంకొన్నాళ్లు కష్టపడితే గడ్డకు పడతం. ఇంకొన్ని బాధలు పోవాల్సిన అవసరమున్నది. పార్టీ విజయం కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా మరింత ఉత్సాహంతో శ్రమించాలి.
-సీఎం కేసీఆర్
జీవితంలో తాను ఒకే ఒకసారి గెలిచి, ఓడిపోయానని కేసీఆర్ గుర్తుచేసుకొన్నారు. 25 ఏండ్ల వయసులో పోటీ చేసినపుడు వాస్తవానికి తానే గెలిచానని, అప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ఉన్నందున తనకొచ్చిన ఐదారు వేల ఓట్లు అటువైపు కలపడంతో 700 ఓట్లతో ఓడిపోయానని చెప్పారు. రీకౌంటింగ్ పెట్టమంటే పెట్టలేదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం మొదలు.. ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదని తెలిపారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ ఎంపీగా ఆయా జిల్లాల ప్రజలు కడుపులో పెట్టుకొని గెలిపించుకున్నారని అన్నారు. తాను పాలమూరు ఎంపీగా ఉన్నపుడు తెలంగాణ సాధించిన గౌరవం ఆ జిల్లా ప్రజలకు కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఈ దఫా ఎన్నికల్లో కచ్చితంగా 95-105 స్థానాలు వస్తాయని పునరుద్ఘాటించిన సీఎం కేసీఆర్… గజ్వేల్‌లో ఎవరు గెలుస్తారో రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వమే వస్తదని అంటారని చెప్పారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఊరూరా తిరిగి, పాదయాత్రలు చేసేదని, కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నందున బాధ్యతలు ఎక్కువై పూర్తి సమయాన్ని గజ్వేల్‌కు కేటాయించలేకపోయానని తెలిపారు. గజ్వేల్‌ను వదిలిపెట్టి కామారెడ్డి ఎందుకు పోతున్నవని జహంగీర్ (కార్యకర్త) అడిగారని, కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు ఒక కారణం ఉందని చెప్పారు. తన ఇల్లు, పొల్లు అంతా గజ్వేల్‌లోనే ఉందని, గజ్వేల్‌ను విడిచిపెట్టి తానెందుకు పోతానని అన్నారు. ‘ఈ సారి గజ్వేల్‌లో ఎంత మెజార్టీ తెస్తరనేది మీ దయ’ అని నియోజకవర్గ పార్టీ శ్రేణులనుద్దేశించి అన్నారు.