హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : టోల్ ఫీజు మినహాయింపులో కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని శాసన మండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తెలంగాణ పండుగల సందర్భంలో మినహాయింపు ఇవ్వకుండా ఆంధ్రా ప్రాంత పండుగైన సంక్రాంతికి మినహాయించడం ఎంతవరకు సమంజసమని, ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగకు వెళ్లే ప్రయాణికులకు టోల్ ఎత్తివేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ తెలంగాణ పండుగలైన దసరా, దీపావళి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేయవద్దని, ఇందుకు సంబంధించి వెంటనే స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్చేశారు. ఆంధ్రాప్రాంత ప్రయాణికులకు సదుపాయం కల్పించడాన్ని తప్పుబట్టడం లేదని, తెలంగాణ ప్రయాణికులపై వివక్ష చూపడం సరికాదని పునరుద్ఘాటించారు.