డిచ్పల్లి, అక్టోబర్ 24: ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు వ్యవస్థ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్పీ ఏడో బెటాలియన్‌కు చెందిన పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని ఏడో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్ల భార్యలు, పిల్లలు గురువారం 44వ జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసు ఉద్యోగమంటే గడ్డి తీయడం, రాళ్లు ఎత్తడమేనా అని ప్రశ్నించారు. బెటాలియన్‌లో పని చేసే తమ భర్తలు వెట్టిచాకిరీ చేస్తున్నారని, నెలలో 4 రోజులు మాత్రమే ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సమయంలో పిల్లలు తమ తండ్రిని కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లతో బెటాలియన్‌లో గడ్డి తీయిస్తున్నారని, రాళ్లు మోయిస్తున్నారని తెలిపారు. బెటాలియన్ పోలీసులకు ఐదేండ్లు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకొకసారి పోస్టింగ్‌లు మార్చడంతో పిల్లల చదువులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాపోయారు. సెలవుల విధానం మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరారు.
పోలీసు కుటుంబాల ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన బెటాలియన్ వద్ద పోలీసు కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయం తెలిసి తన వాహనం దిగి వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బెటాలియన్ సిబ్బంది సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న పోలీసు కుటుంబాలకు నచ్చజెప్పేందుకు బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ ఎంఐ సురేశ్ ఇతర అధికారులు ప్రయత్నించినా శాంతించక పోవడంతో మహిళలను బలవంతంగా తీసుకెళ్లి వాహనాల్లో తరలించారు.