మరిపెడ, డిసెంబర్ 19: కాంగ్రెస్ నాయకులు తమ వార్డు సభ్యుడిని కిడ్నాప్ చేశారని మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్లసంకీసకు చెందిన బీఆర్ఎఎస్ నాయకులు శుక్రవారం మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పెరుమాండ్లసంకీసలో పది వార్డులతోపాటు సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కోల్పోయినా, పది వార్డుల్లో ఆరు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఉప సర్పంచ్ పదవి దక్కదనే అక్కసుతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ మద్దతుదారుడైన వార్డుసభ్యుడిని కిడ్నాప్ చేసి మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు బీఆర్ఎస్ నేతలను స్టేషన్కు తరలించారు.